►రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టింది. పాజిటివిటీ రేటు 1.47 శాతానికి తగ్గింది. కరోనా పూర్తిగా తగ్గాక మరో విడత పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతా.
►పల్లెలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే–అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. వాటిపై చర్యలు తీసుకోవాలి.
►మున్సిపాలిటీల బడ్జెట్ తయారీలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని కోరాం. వారు ఎలా భాగస్వాములవుతున్నారో పరిశీలిస్తున్నాం.
►పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్‌లు ఇకపై పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రగతి తీరును పరిశీలించాలి.
సాక్షి, హైదరాబాద్: పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్వయంగా ఆకస్మిక తనిఖీలను చేపడతానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలుస్తున్నా ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. నిర్దేశిత బాధ్యతలను నిర్వర్తించడంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. పల్లె/పట్టణ ప్రగతి అమలుపై శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ‘పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలి. ఈ విషయంలో పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఉద్యోగులు అలసత్వానికి తావివ్వకూడదు. మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదు. రెండేళ్లు గడిచిపోయాయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. తాత్సారం, అలసత్వం, నిర్లక్ష్యం వహించినట్లు నా పర్యటనలో గుర్తిస్తే ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు... క్షమించేదీ లేదు. కఠిన చర్యలు తీసుకుంటం’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
అదనపు కలెక్టర్ల పనితీరు బాగోలేదు..
‘అదనపు కలెక్టర్లు ఆశించిన రీతిలో సామర్థ్యాన్ని నిరూపించుకోవట్లేదు. వారి నుంచి చాలా ఆశించా’ అని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పల్లెలు, పట్టణాలను బాగు చేయడానికి నియమించిన అదనపు కలెక్టర్లు నిరంతరం క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉండాలని ఆదేశించారు. డీపీవోలు, కింది స్థాయి ఉద్యోగులను ఆ దిశగా ఉత్సాహపరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును సమీక్షించేందుకు 13న అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారు (డీపీవో)లతో ప్రగతి భవన్‌లో భేటీ కానున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, పాజిటివిటీ రేటు 4.7 శాతానికి పడిపోయిందన్నారు. కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపడతామని తెలిపారు.
ప్రగతిపై చార్టులు
పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై వేర్వేరు చార్టులను రూపొందించాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, మంచినీటి సరఫరా, బతికిన మొక్కల శాతం, గ్రామ సభల నిర్వహణ, స్థానిక ఎంపీవోల హాజరు, అందులో వారు గ్రామ ప్రగతికి తీసుకున్న చర్యలు, ఎన్నిసార్లు గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ ప్రగతి నివేదికలపై జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టుల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చెత్త సేకరణ, డంపు యార్డులు, వైకుంఠధామాల నిర్మాణ స్థితి, బోరు బావులు పూడ్చడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాక్టర్ల కిస్తులు కడుతున్న తీరు, కరెంటు బిల్లుల వసూలు, గ్రామ పంచాయతీ ఉద్యోగులకు జీతాల చెల్లింపు, డ్రైనేజీలు, నాలాల క్లీనింగ్, శాకాహార, మాంసాహార మార్కెట్ల నిర్మాణం వంటి అంశాలను చార్టుల్లో చేర్చాలన్నారు. ఉత్తమ గ్రామాలు, మండలాలు, అధ్వానంగా ఉన్న గ్రామాలు, మండలాలను గుర్తించి వాటికి గల కారణాలను చార్టుల్లో పేర్కొనాలని ఆదేశించారు. మంచి చెడులను రెండింటిని ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారు చేసి, ఆకస్మిక తనిఖీల్లో తనకు అందచేయాలని సీఎస్‌ను ఆదేశించారు. పురపాలక శాఖ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్‌లు ఇకపై పట్టణాలు, గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో ప్రగతి తీరును పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డీపీవోలు కూడా పల్లె పర్యటనలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చార్టులు..
గ్రామాల్లో సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు సీజన్లవారీగా తీసుకోవాల్సిన చర్యలతో చార్ట్ తయారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. ‘వానాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు, చలికాలంలో స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు, ఎండాకాలంలో డయేరియా వంటి వ్యాధులు వస్తుంటయి. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులను అరికట్టడం చాలా కీలకం. ఇందుకు పంచాయితీరాజ్, మున్సిపల్, వైద్యశాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో తాగునీటి సరఫరా ట్యాంకులను శుద్ధి చేయాలని సూచించారు.
అక్రమ లేఅవుట్లపై చర్యలు ...
పల్లెలు, మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లే–అవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నట్టు తనకు సమాచారం వుందని, వాటిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపాలిటీల బడ్జెట్ రూపకల్పనలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని కోరామని, ఏ మేరకు అవుతున్నారని ఆరా తీశారు.
చదవండి: మొక్కలు ఎందుకు ఎండిపోయాయ్.. కొత్తవి నాటండి: కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment