సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా పథకాలను అమలు చేయాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు నిర్వహించే సభలకు టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరవుతారు. అయితే దేశవ్యాప్త పర్యటనకు ముందు నిజామాబాద్, వరంగల్‌లో రైతులతో భారీ సభలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రాథమికంగా నిర్ణయించారు.
రెండు రోజులుగా రైతు సంఘాల నేత రాకేశ్ తికాయత్‌తో ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా సమావేశమైన కేసీఆర్.. దేశ వ్యాప్తంగా రైతు సదస్సుల నిర్వహణకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్న టికాయత్‌తో పాటు మరో ఇద్దరు రైతు సంఘాల నేతలు ప్రగతిభవన్‌లోనే విడిది చేసినట్లు సమాచారం. తికాయత్ బృందంతో జరిగిన భేటీలో రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది.
సభల షెడ్యూల్, ఎజెండా ఖరారు!
రైతు సదస్సులను తొలుత వచ్చే నెల మొదటి వారంలో నిజామాబాద్‌లో, ఆ తర్వాత వరంగల్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సదస్సులు నిర్వహించేందుకు అనువైన ప్రాంతాలు, షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలిసింది. రైతు బంధు, రైతు బీమాతో పాటు కులవృత్తుల కోసం చేపట్టిన గొర్రెలు, చేప పిల్లల పంపిణీ వంటి కార్యక్రమాలను సభల్లో వివరిస్తారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను కూడా ఎండగట్టేలా కేసీఆర్ ఎజెండా ఖరారు చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment