
తన వ్యవసాయ క్షేత్రంలో మొక్క నాటుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ సంతోష్, టీటీడీ బోర్డు సభ్యుడు దామోదర్ రావు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు సందర్భంగా హరిత స్ఫూర్తిని చాటుతూ రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’లో భాగంగా ఉదయం 10 నుంచి 11 గంటల వ్యవధిలో కోటి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తన వ్యవసాయ క్షేత్రంలో రుద్రాక్ష మొక్క నాటారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కుటుంబసభ్యులతో కలసి ప్రగతిభవన్ ప్రాంగణంలో, ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో భర్త అనిల్‌తో కలసి మొక్కలు నాటారు. మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ తదితరులతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు టీఆర్‌ఎస్ కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు.
ఒకే గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటాల్సి రావడంతో గ్రామ వన నర్సరీలు, ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీల నుంచి మొక్కలు సేకరించేందుకు స్థానిక నేతలు భారీ కసరత్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్ శ్రేణులతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వివిధ వర్గాలకు చెందిన వారు కూడా ‘కోటి వృక్షార్చన’లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా, తన పుట్టిన రోజు సందర్భంగా కోటి వృక్షార్చన చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ బాధ్యతలు తీసుకున్న రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌ను సీఎం అభినందించారు.
సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు..
- సీఎం 67వ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో కేటీఆర్ పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తులా ఉమతో పాటు టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు తదితరులు మొక్కలు నాటారు. సీఎం చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 22 శాతంగా ఉన్న గ్రీన్‌కవర్ 33 శాతానికి పెరుగుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్స్‌లో ‘హోప్ 4 స్పందన’ఆధ్వర్యంలో పోలియో బాధితులకు ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.
- రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అన్ని పారిశ్రామికవాడల్లో మొత్తం 1.62 లక్షల మొక్కలు నాటారు. బండ మాదారం సీడ్స్ ఆగ్రోపార్క్‌లో జరిగిన కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి మొక్కలు నాటారు.
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జల విహార్‌లో జరిగిన సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పాల్గొన్నారు. కేసీఆర్ జీవన ప్రస్థానంపై రూపొందించిన త్రీడీ డాక్యుమెంటరీతో పాటు ప్రత్యేక గీతాలను విడుదల చేశారు. బల్కంపేట ఎల్లమ్మకు తలసాని శ్రీనివాస్ యాదవ్ 2 కిలోల బంగారంతో తయారు చేసిన పట్టు చీర సమర్పించారు.
- సింగరేణి వృక్షోత్సవం పేరిట సింగరేణి భవన్‌లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రారంభించారు. సంస్థ పరిధిలోని 11 ప్రాంతాల్లో 2.35 లక్షల మొక్కలు నాటారు.
- కోటి వృక్షార్చనలో భాగంగా మలక్‌పేట వికలాంగుల సంక్షేమ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మొక్కలు నాటారు.
Comments
Please login to add a commentAdd a comment