మర్కూక్ (గజ్వేల్): బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని తమ ఫామ్‌హౌస్‌లో బుధవారం రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఉదయం విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్వంలో యాగానికి అంకురార్పణ చేయగా.. సీఎం కేసీఆర్ దంపతులు యాగ సంకల్పం చెప్పి పండితులకు దీక్షా వ్రస్తాలను ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రుత్విక్కులు ఈ యాగంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వరూపానందేంద్రస్వామి మాట్లాడుతూ.. రుద్ర, చండీ, నవదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని రాజశ్యామల యాగం విశిష్టమైనదని తెలిపారు. రాజులతోపాటు సామాన్యులను అనుగ్రహించే మహాశక్తివంతమైన రాజశ్యామల యాగం కఠినమైన బీజాక్షరాలతో కూడినదని.. సీఎం కేసీఆర్ కుటుంబానికే కాకుండా యావత్ రాష్ట్రానికి ఇది ఆశీర్వాదం వంటిదని వివరించారు.
శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసి..
తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధి కోరుకుంటూ సీఎం కేసీఆర్ తలపెట్టిన ఈ యాగానికి రాజశ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా నామకరణం చేసినట్టు రుత్విక్కులు తెలిపారు. ఫామ్‌హౌస్‌లో శాస్త్రోక్తం గా ప్రారంభమైన యాగం రెండు రోజుల పాటు జరగనుంది. తొలి రోజున ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతిపూజ, పుణ్యహవచనం, పంచగవ్య ప్రసనతో అంకురార్పణ చేశారు.
అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామికి కేసీఆర్ దంపతులు సాష్టాంగ నమస్కారం చేసి.. గురు ఆజ్ఞ తీసుకొని యాగాన్ని ప్రారంభించారు. రుత్విక్కులు కేసీఆర్ దంపతులతో యాగ సంకల్పం చెప్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని నవదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రా ర్థిస్తూ అస్త్రరాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. అఖండ స్థాపన అనంతరం యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment