
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్)కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. జేపీఎస్‌ల సర్వీసును పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను ఆదేశించారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా అటవీ అధికారి, జిల్లా ఎస్పీ/డీసీపీ సభ్యులుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయిలో ఒక కార్యదర్శి స్థాయి లేదా హెచ్‌ఓడీ స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీలు పంపించిన ప్రతిపాదనలను రాష్ట్రస్థాయి కమి టీ పరిశీలిస్తుంది. అనంతరం సీఎస్‌కు నివేది కను పంపిస్తుంది. దాని ఆధారంగానే క్రమబద్ధీకరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
తాత్కాలిక జేపీఎస్‌ల స్థానంలో...
రాష్ట్రంలో కొన్ని గ్రామ పంచాయతీల్లో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కొత్త జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీ ప్రక్రియను క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
ఉన్నతాధికారులతో ఎర్రబెల్లి, హరీశ్ భేటీ
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్థిక మంత్రి హరీశ్‌తో కలసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సచివాలయంలో తొలుత సీఎస్ ఎ.శాంతికుమారితో, ఆ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో సోమవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా వ్యవహరిస్తున్నారు’అని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించినందుకు సీఎంకు కృతజ్ఞతలు, జేపీఎస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శకాల రూపకల్పనపై మంగళవారం సైతం ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు చెప్పారు.
సీఎంకు రుణపడి ఉంటాం: జేపీఎస్ ఫెడరేషన్
తమ సర్వీసుల క్రమబద్ధీకరణ దిశగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలంగాణ జూనియర్ పంచాయతీ సెట్రకరీ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని, జాతీయస్థాయిలో రాష్ట్రానికి మరిన్ని అవార్డులు తెచ్చేలా నిర్విరామంగా కృషి చేస్తామన్నారు. మరోవైపు సీఎం నిర్ణయం శుభపరిణామమని తెలంగాణ పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ అధ్యక్షుడు పి.మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment