సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శుక్రవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం అక్కడున్న రోగులతో వైద్యానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 10.30 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరనున్న కేసీఆర్.. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11 గంటలకు చేరుకుంటారు.
అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయి ద్వారా హంటర్‌రోడ్‌లోని ఎంపీ కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు ఇంటికి వెళ్తారు. కొద్దిసేపు విరామం తర్వాత 11.20 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలు సందర్శనకు బయలుదేరుతారు. జైలు ఆవరణ, సౌకర్యాలు, ఖైదీల వసతులను పరిశీలించిన అనంతరం జైలు అధికారులు, ఖైదీలతో మాట్లాడతారని అధికారులు వెల్లడించారు. జైలు సందర్శన తర్వాత నేరుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపీ లక్ష్మీకాంతారావు ఇంటికి చేరుకుని భోజనం చేసిన అనంతరం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం కేసీఆర్ 2 గంటలకు ఎంజీఎం ఆస్పత్రికి చేసుకుంటారు. వైద్యం పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం, ఆస్పత్రిలో సౌకర్యాలను పరిశీలించనున్నారు.
ఉన్నత స్థాయి సమీక్ష..!
ఎంజీఎంను పరిశీలించిన పిదప 3 గంటలకు కరోనా బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. కరోనా నియంత్రణ చర్యలపై కీలకమైన ప్రకటనలు చేయనున్నారని తెలుస్తోంది. 4 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.
నగరంలో 5 గంటలు..
రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఉమ్మడి వరంగల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర జిల్లాల్లో పర్యటించినా.. వరంగల్ నగరానికి చాలాకాలం తర్వాత వస్తున్నారు. సుమారు 5 గంటల పాటు నగరంలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గురువారం ఎంజీఎం ఆస్పత్రి, సెంట్రల్ జైలును సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కోవిడ్ వార్డులో బాధితులకు అందుతున్న వైద్య చికిత్సపై ఆరా తీశారు. కాగా సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఆరు సెక్టార్లుగా భారీ భద్రతా, బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment