సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతోంది. గ్రామంలోని దళితవాడల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. దళితవాడలో కాలినడకన ఇంటింటికి వెళ్లి ‘దళితబంధు’ పథకం గురించి ఏ మేరకు అవగాహన ఉందో దళితులను అడిగి తెలుసుకున్నారు. ‘దళిత బంధు’ పథకంతో వచ్చే పెద్ద మొత్తం డబ్బుతో ఎలాంటి ఉపాధి పొందుతారని దళితులను అడిగి తెలుసుకున్నారు. పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును వృధా చేసుకోవద్దని స్పష్టమైన అవగాహనతో దళిత బందు ద్వారా లబ్ధి పొందాలని సీఎం సూచించారు. సుమారు గంటకుపైగా దళితవాడల్లో కాలినడకన కలియతిరిగారు. గ్రామమంతా కలియతిరిగి మొత్తం పరిశీలించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్తులతో కూడా మాట్లాడారు.
అనంతరం గ్రామ అభివృద్ధిపై రైతు వేదికలో గ్రామస్తులతో సమావేశం కానున్నారు. వాసాలమర్రికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. జూన్ 22వ తేదీన కేసీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment