సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వచ్చే యాసంగిలో తెలంగాణలో ఎంతమేర వరిధాన్యం కొంటుందో ముందుగానే నిర్ధారించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు గత యాసంగి (2020–21) సీజన్‌లో సేకరించకుండా మిగిలిన 5 లక్షల టన్నుల ధాన్యాన్ని తక్షణమే సేకరించాలని కోరారు.
ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 40 లక్షల టన్నుల నుంచి పెంచాలని.. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ ప్రస్తుత (2021–22) వానాకాలం పంటలో 90 శాతం మేర సేకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ మూడు ప్రధాన అంశాలపై వెంటనే చర్యలు తీసుకునేలా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ని ఆదేశించాలని అందులో కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన, లేఖలోని ముఖ్యాంశాలివీ..
ఎఫ్‌సీఐ తీరు అయోమయం
‘‘సురక్షిత నిల్వలను కొనసాగిస్తూ, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తూ.. దేశ ప్రజలకు ఆహార భద్రతను కల్పించే తప్పనిసరి బాధ్యతలను నెరవేర్చాల్సిన ఎఫ్‌సీఐ.. అసంబద్ధ విధానాలను అవలంబిస్తూ అటు రైతులను, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను అయోమయానికి గురి చేస్తోంది. ఏడాదికి సరిపడా ధాన్యం సేకరించే లక్ష్యాలను ఎఫ్‌సీఐ ఒకేసారి నిర్ధారించడం లేదు.
ఏటా ధాన్యం దిగుబడి పెరుగుతోందని తెలిసినా ధాన్యాన్ని వేగవంతంగా సేకరించడం లేదు. ఎఫ్‌సీఐ అనుసరిస్తున్న ఈ రెండు అయోమయ విధానాలు రైతులకు సరైన పంటల విధానాన్ని వివరించడానికి ప్రతిబంధంగా మారాయి..’’ అని ప్రధానికి రాసిన లేఖలో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2021 వానాకాలంలో తెలంగాణలో 55.75 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అయితే, కేవలం 32.66 లక్షల టన్నుల (59 శాతం)ను మాత్రమే ఎఫ్‌సీఐ సేకరించిందని.. 2019–20 వానాకాలంలో సేకరించిన ధాన్యం కంటే అది 78% తక్కువని వివరించారు.
ధాన్యం సేకరణలో ఇలా విపరీత తేడాలుంటే రాష్ట్రంలో హేతుబద్ధమైన పంట విధానాలను అమలు చేయలేమని తెలిపారు. ఇటువంటి అయోమయ పరిస్థితులను తొలగించి ధాన్యం సేకరణలో నిర్థిష్టమైన లక్ష్యాన్ని నిర్థారించాలని కోరేందుకు తాను స్వయంగా కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 25, 26 తేదీల్లో కలిశానని గుర్తుచేశారు. వార్షిక ధాన్య సేకరణ లక్ష్యాన్ని తక్షణమే నిర్ధారించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేసి 50 రోజులు దాటిపోయినా.. ఇప్పటివరకు ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని వివరించారు.
ఇప్పటికైనా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ అమలు చేస్తున్న విధానాలతో వ్యవసాయ రంగం గణనీయ ప్రగతి సాధించిన సంగతి తెలిసిందేనని.. 24 గంటల ఉచిత విద్యుత్, రైతులకు ఏటా ఎకరాకు పదివేల రూపాయల పంటపెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. సాగునీటి లభ్యత పెరిగాక, ధాన్యం దిగుబడిలో మిగులు రాష్ట్రంగా మారడంతోపాటు దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ మారిందని వివరించారు.
ఎఫ్‌సీఐ ఓసారి మామూలుగా, మరోసారి అతితక్కువగా ధాన్యం కొంటోంది. దీనివల్ల అయోమయం నెలకొని రాష్ట్రంలో సరైన పంట విధానాలను అమలు చేయలేకపోతున్నాం. ఎంత ధాన్యం కొంటారో ముందే నిర్ధారించండి. పంజాబ్‌లో కొంటున్న తరహాలో మొత్తం పంటలో 90 శాతం మేర సేకరించండి. – మోదీకి లేఖలో సీఎం కేసీఆర్
నేడు సీఎం, మంత్రుల నిరసన
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరేమిటో వెల్లడించాలన్న డిమాండ్‌తో గురువారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు టీఆర్‌ఎస్ ఏర్పాట్లు పూర్తిచేసింది. పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో జరిగే ఈ మహా«ధర్నాలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతుబంధు సమితి చైర్మన్లు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇందిరాపార్కు వద్ద ఏర్పాట్లను మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం పరిశీలించారు.
గవర్నర్‌కు వినతిపత్రం: గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు జరిగే మహాధర్నాలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో కలిసి సీఎం రాజ్‌భవన్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యలను వివరించాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు. ఇక ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి తదుపరి కార్యాచరణను గురువారం నాటి మహాధర్నాలో సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
బలప్రదర్శన కాదు: హరీశ్‌రావు
ఇందిరాపార్కు వద్ద నిర్వహిస్తున్న ధర్నా తమ బలప్రదర్శన కాదని, రైతుల పక్షాన కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ నిరసన చేపడుతున్నామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇందిరాపార్కు వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే ఉంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోవాలనే డిమాండ్‌తో ధర్నా చేస్తున్నామని తెలిపారు.
గతంలో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో అన్ని రాష్ట్రాల పట్ల కేంద్రం ఒకేలా వ్యవహరించాలని, స్పష్టమైన వైఖరి ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, జోగు రామన్న ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment