మహేశ్వరం: తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషిచేస్తున్నారని స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో రూ.14 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శనివారం స్థానిక మంత్రి సబితారెడ్డితో కలసి ఆమె శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బంజారాలు, ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు. రూ.100 కోట్లతో హైదరాబాద్‌లో బంజారా భవన్, ఆదివాసీ భవన్‌లను నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ సిబ్బంది నిరసన
మహేశ్వరంలో పర్యటిస్తున్న మంత్రుల వాహనాలను అంగన్‌వాడీ సిబ్బంది అడ్డుకున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శివగంగ రాజేశ్వరాలయం ఎదుట ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన ఆందోళనకారులు కాన్వాయ్‌కి అడ్డుగా నిలిచారు.
వెంటనే తేరుకున్న పోలీసులు వారిని పక్కకు నెట్టేసి కాన్వాయ్‌ను ముందుకు పంపించారు. ఈ సందర్భంగా పోలీసులు తమతో దురుసుగా వ్యవహరించారని నిరసనకారులు మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై స్పందించిన మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అంగన్‌వాడీలు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment