హఫీజ్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్–2050 దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో పనిచేసిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు గత ప్రభుత్వాల నిర్ణయాలను మరింత పకడ్బందీ ప్రణాళికలతో అమలు చేయడం వల్లే ఔటర్‌రింగు రోడ్డు, అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం, హైటెక్ సిటీ వంటివి అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
దేశమే కాకుండా ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ దేశంలోనే ఐదవ మెట్రోపాలిటన్ సిటీగా గుర్తింపు పొందిందని చెప్పారు. దీన్ని మరింతగా అభివృద్ధి చేయాలన్నదే ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని, అందరి సలహాలు, సూచనలతో అందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. తొందరపాటు చర్యలతో మేడిగడ్డ తరహాలో కానివ్వబోమని అన్నారు. ఆదివారం శేరిలింగంపల్లిలోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ ప్రాంతంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఫార్మా సిటీ స్థలంలో కొత్త నగరం
‘వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలోని ఓఆర్‌ఆర్, రీజనల్ రింగురోడ్డు మధ్య ఇటు, అటు ప్రాంతాలను ఎంపిక చేసి అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా విభజిస్తాం. చైనా తరహాలో 10 నుంచి 15 శాటిలైట్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేస్తాం. వాటిల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తాం. ఫార్మాసిటీని రద్దు చేస్తామనే అపోహ ఉంది. అది నిజం కాదు. ఫార్మా సిటీకి కేటాయించిన స్థలంలో కొత్త నగరం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఒకేచోట ఫార్మాసిటీ అని కాకుండా విభిన్న ప్రాంతాల్లో కాలుష్య రహిత ఫార్మా విలేజ్‌లను ఏర్పాటు చేస్తాం. ఆస్పత్రులు, స్కూళ్ళు, షాపింగ్‌మాల్స్, ఇతర అన్ని రకాల సదుపాయాలుండేలా చూస్తాం..’అని సీఎం తెలిపారు.
ఆర్‌ఆర్‌ఆర్ చుట్టూ రైలు సౌకర్యం
‘మెట్రో రైలు సౌకర్యం మరింత మందికి చేరువలో ఉండేలా చేయాలనే సంకల్పంతో కొత్త మార్గాలను రూపొందించాం. మొదటగా ఎయిర్‌పోర్టుకు, మియాపూర్ నుంచి ఆర్ïసీ పురం వరకు, రాయదుర్గం నుంచి గచ్చిబౌలి కూడలి మీదుగా అమెరికన్ కాన్సులేట్ భవనం వరకు మెట్రో ఏర్పాటు చేయాలని సంకల్పించాం. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణ సమయంలో చుట్టూ రైలు సౌకర్యం ఏర్పాటు చేసేలా చూస్తాం..’అని రేవంత్ చెప్పారు.
ఫైర్ విభాగంలో ఖాళీల భర్తీ
‘ప్రపంచంలో ఎక్కడైనా ల్యాండ్ మార్క్‌లు నిర్మించేది బిల్డర్లు, కాంట్రాక్టర్లే. వారి సమస్యలు ఏమి ఉన్నా పరిష్కరించేందుకు, వారికి అందుబాటులో ఉండేందుకు సిద్ధం. నగరాభివృద్ధిలో ఫైర్ విభాగం పాత్ర ఎంతో ఉంది. 50–60 అంతస్తుల భవనాలకు ఎన్‌ఓసీ ఇవ్వడంలో వారి పాత్ర కూడా ఉంటుంది. కానీ వారికి భవనం లేకపోవడం విడ్డూరం. క్రెడాయ్ (భారత రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంఘాల సమాఖ్య) ముందుకొచ్చి భవన నిర్మాణం చేపట్టడం అభినందనీయం.
క్రెడాయ్ వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధం. ఫైర్ విభాగంలో ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. పోలీస్ విభాగం తరహాలో ఫైర్ సిబ్బంది అందరికీ న్యాయం చేసేలా చూస్తాం..’అని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.మహేందర్‌రెడ్డి, క్రెడాయ్ అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, ఫైర్ విభాగం అదనపు డీసీ నాగిరెడ్డి, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి మెగా ప్లాన్
Published Mon, Feb 19 2024 5:43 AM | Last Updated on Mon, Feb 19 2024 2:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment