తక్షణ తాత్కాలిక ఉపశమనంగా ఈ నిధులివ్వాలని ప్రధానిని కోరాం: రేవంత్
వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 4–5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి
16 మంది ప్రాణాలు కోల్పోయారు
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది.. ఆందోళన వద్దు
వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి
వచ్చే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మం, సూర్యాపేటలో వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష
ఖమ్మంలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన.. బాధితులకు పరామర్శ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత మూడు రోజులుగా వర్షాలు, వరదలతో రాష్ట్రంలో రూ.5,438 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సర్వం కోల్పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు తక్షణ తాత్కాలిక ఉపశమనంగా ఈ నిధులను మంజూరు చేయాల్సిందిగా ప్రధానమంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని కోరామని వెల్లడించారు. వారు సంపూర్ణ సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకెళ్ళామని తెలిపారు.
కేంద్రం వెంటనే కనీసం రూ.2 వేల కోట్లు అయినా విడుదల చేసేలా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం కూడా పెద్దన్న పాత్రలో సాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ సమీపంలో వరద తాకిడితో గండిపడిన ఎన్నెస్పీ కాల్వను సోమవారం ఆయన పరిశీలించారు.
ఆ తర్వాత పాలేరు రిజర్వాయర్ అలుగు, దెబ్బతిన్న ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి, అక్కడే పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప వద్ద ముంపునకు గురైన బాధితుల ఇళ్లను సందర్శించి వారిని పరామర్శించారు. ఆపై ఖమ్మంలోని మున్నేటి సమీపాన ఉన్న బొక్కలగడ్డ, మంచికంటినగర్‌ల్లో వరద ఉధృతిని పరిశీలించి బాధితులతో మాట్లాడారు.
అనంతరం కలెక్టరేట్‌లో వరద పరిస్థితిపై సమీక్షించారు. అంతకుముందు సూర్యాపేట జిల్లా మోతె మండలం నామవరం వద్ద మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పంట, ఆస్తి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాగర్ ఎడమకాలువ తెగడం వల్ల వాటిల్లిన నష్టంపైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు.
అండగా నిలిచేందుకే వచ్చాం
‘ఖమ్మం జిల్లాలో మున్నేరు, పాలేరు, ఆకేరు పోటెత్తడంతో పాలేరు, మధిర, ఖమ్మం నియోజకవర్గాలకు ఊహించని ఉపద్రవం జరిగింది. రెండు రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, పోలీసు అధికారులు పని చేస్తున్నారు. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించాం. ప్రజలు ఆవేదనతో ఉన్నప్పుడే ప్రభుత్వం వెళ్లి వారి బాధలు వినాలనే ఉద్దేశంతో జిల్లాలకు వచ్చాం.
ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పిస్తున్నాం. 80 ఏళ్లలో మున్నేరుకు ఇంత పెద్ద వరద ఎప్పుడూ రాలేదని స్థానిక ప్రజలు చెప్పారు. సూర్యాపేట జిల్లాలో 21 చెరువులు తెగిపోయాయి. 15 గ్రామాల నుంచి 420 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 20 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. 7 పశువులు చనిపోగా, 7 పక్కా ఇళ్లు, 33 కచ్చా ఇళుŠల్ కూలిపోయాలి. వరదల్లో చిక్కుకుని ఇద్దరు చనిపోయారు.
వరద బాధితులకు అండగా ఉండి ఆదుకుంటాం. ఆందోళన చెందవద్దు. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి సాయం కోరాం. తక్షణమే దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కూడా అడిగాం. మేం కూడా రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాం. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చాం..’ అని సీఎం రేవంత్ తెలిపారు.
నష్టపోయిన ప్రతి ఇంటికీ రూ.10 వేల తక్షణ సాయం
‘ఎక్కడో ఉన్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల కోసం ఎదురుచూస్తూ సమయం వృధా కాకుండా ఉండేందుకు తెలంగాణ డీఆర్‌ఎఫ్ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలో 8 చోట్ల 100 మంది చొప్పున యూనిట్లను పెట్టనున్నాం. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికీ తక్షణ సాయంగా రూ.10 వేలు ఇస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఇళ్లల్లో నీరు చేరి నిత్యావసర వస్తువులు పాడైన ప్రతి ఇంటికి రూ.10 వేలు ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు.
అధికారుల సెలవులు రద్దు
‘రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలి. వరదల కారణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదమున్నందున వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా వరద సహాయక చర్యల్లో పాల్గొనాలి. వరదల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సిబ్బంది సెలవులు రద్దు చేస్తున్నాం. ఎవరైనా విధులకు హాజరు కాకపోతే వారి వివరాలను నమోదు చేయాలి. తక్షణ సహాయం కోసం అధికారులు నివేదికలను నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలి.
ప్రతిఒక్కరూ ప్రజలకు అండగా నిలవాలి
ప్రజలను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా బాధితులను ఆదుకోవాలి. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ ప్రజలకు అండగా నిలబడాలి. వరదల వల్ల నష్టపోయిన ప్రజల సహాయార్థం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం.
ఇలాగే స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఎవరైనా సీఎం సహాయనిధికి విరాళాలు అందిస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. వరద ముంపు అంశాలపై ప్రభుత్వానికి మీడియా కూడా సహకరించాలి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. కొన్ని పార్టీలకు చెందిన మీడియా పోకడలు మారకపోతే ప్రజలే చూస్తారు..’ అని రేవంత్ అన్నారు.
పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల వద్దకు వెళ్తున్నారు..
‘ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అర్ధరాత్రి కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. ఢిల్లీలో ఉన్న ఉత్తమ్ కూడా హుటాహుటిన వచ్చారు. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల వద్దకు వెళ్లి వరదల్లో నష్టపోయిన వారిని పరామర్శిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ప్రతిపక్ష నేత మౌనముద్ర దాల్చారు. కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదని విమర్శిస్తున్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎందుకు అడగడం లేదు? కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్షల కోట్ల సొమ్ములో రూ.వెయ్యి కోట్లో.. రూ.రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వొచ్చు కదా?..’ అని రేవంత్ అన్నారు.
ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుంది: డిప్యూటీ సీఎం
వరద విపత్తుతో నష్టపోయిన ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం మర్చిపోయిన గత పాలకులు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే విధంగా విమర్శించడం తగదన్నారు. భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్‌గా ఉండటం, సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ముందస్తుగా అప్రమత్తం చేయడం వల్ల ఇంత పెద్ద ఉపద్రవం వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించలేదని అన్నారు.
ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటాం: మంత్రి పొంగులేటి
వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్నీ ఆదుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. 85 ఏళ్ల క్రితం మున్నేరు వద్ద 35 అడుగుల మేర వరద ప్రవహించిందని, మళ్లీ ఇప్పుడు 35 అడుగులు దాటిందని చెప్పారు. మున్నేరు ప్రళయం ధాటికి వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం హెలికాప్టర్ తెప్పించే ప్రయత్నం చేసినా వాతావరణం అనుకూలించలేదని తెలిపారు. వరదలను కూడా ప్రతిపక్ష పారీ్టలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. చేతతనైతే మంచి సూచనలు ఇవ్వండి కానీ, రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యవద్దని హితవు పలికారు.
ఊహించని ఉపద్రవం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కనీ వినీ ఎరుగని విధంగా మున్నేరు ప్రళయం వచ్చిందని, ఇది ఊహించని ఉపద్రవం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ సమయంలోనే 47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. రెండు అంతస్తుల భవనాలు కూడా నీటమునిగాయని తెలిపారు. పేద కుటుంబాల గూడు చెదిరిందని, నష్ట తీవ్రత భారీగా ఉందని అన్నారు.
మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కోమటిరెడ్డి
వర్షాలు, వరదల్లో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. మున్నేరు ముంపునకు గురైన వారి పరిస్థితి చూస్తే కన్నీళ్లు వచ్చాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆవేదన చెందారని, మున్నేరు ఉధృతికి సంబంధించి టీవీలో వార్తలు చూసిన తర్వాత తాను కూడా ఖమ్మం రావాలనుకున్నట్లు తెలిపారు. అంతలా ఖమ్మంలో వర్ష బీభత్సం కొనసాగిందన్నారు. అధికార యంత్రాంగం కలిసికట్టుగా పని చేసి ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.
ఉద్రిక్తత నడుమ సీఎం పర్యటన
ఖమ్మంలోని మున్నేరు పరివాహక ప్రాంతం బొక్కల గడ్డలో సీఎం పర్యటన సందర్భంగా, ఆయన రాకముందు వరద బాధితులు కొందరు సీఎం డౌన్ డౌన్, ముగ్గురు మంత్రులు డౌన్ డౌన్ అని నినాదాలు చేస్తూ రోడ్డుకు అడ్డంగా తడిసిన సామాగ్రి వేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. అనంతరం భారీ భద్రత నడుమ మంచికంటినగర్ మీదుగా సీఎం పర్యటన కొనసాగింది. మధ్య మధ్యలో కూడా కొందరు నిరసన తెలపగా పోలీసులు చెదరగొట్టారు. ఇక ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో తురకకుమారి, అన్నపూర్ణమ్మ ఇళ్లకు వెళ్లి జరిగిన నష్టంపై సీఎం ఆరా తీశారు.
అయితే తమకు వరద సహాయం మరింత పెంచి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత మహిళలు కొందరు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఓపెన్ టాప్ జీపు పైనుంచి బాధితులతో మాట్లాడిన సీఎం.. వెళ్తున్న క్రమంలో ఆయనను అడ్డుకుని త్వరగా సాయం అందించాలని కోరడంతో, అన్నిరకాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. కాగా సీఎం వెంట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాంనాయక్, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మట్టా రాఘమయి, యశశి్వనిరెడ్డి, రామదాసు, జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, నలమాద పద్మావతిరెడ్డి, సామేల్, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లాల ఉన్నతాధికారులు ఉన్నారు.
మంత్రి పొంగులేటి ఇంట్లో బస..
సాయంత్రం నాలుగున్నర గంటలకు ఖమ్మం జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వరద ప్రాంతాల్లో పర్యటన అనంతరం కలెక్టరేట్‌లో రాత్రి 8 గంటల వరకు సమీక్ష జరిపారు. ఆ తర్వాత ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిలో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం ఇక్కడి నుంచి మహబూబాబాద్ జిల్లాకు వెళ్లి అక్కడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment