3.6 కోట్ల మంది..  యువతకు ఉద్యోగాల్లేవు | CMIE Revealed Jobless Youth People | Sakshi
Sakshi News home page

3.6 కోట్ల మంది..  యువతకు ఉద్యోగాల్లేవు

Published Sun, Feb 13 2022 4:26 AM | Last Updated on Sun, Feb 13 2022 4:26 AM

CMIE Revealed Jobless Youth People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ యువత త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. 2021లో 18–29 ఏళ్ల మధ్య వయస్సులోని 3.6 కోట్లమంది యువజనులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకక నిరుద్యోగం కోరల్లో చిక్కుకున్నారు. కోట్లాది మంది చాలా తక్కువ జీతాలు, వేతనాలతో కూడిన ఉద్యోగాలతో సర్దుబాటు చేసుకున్నారు.

కాగా భారత్‌లో గత డిసెంబర్‌లో నిరుద్యోగిత శాతం 7.91గా నమోదైనట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు వెల్లడించాయి. 2017–18లో ఇది 4.7 శాతంగా, 2018–19లో 6.3 శాతంగా ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని దాదాపు 140 కోట్ల జనాభాలో ఐదో వంతు కంటే ఎక్కువగా ఉన్న యువతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని సీఎంఐఈ పేర్కొంది. 

కోవిడ్‌తో మరింత పెరిగిన నిరుద్యోగిత 
కోవిడ్‌ మహమ్మారి కాలంలో.. గత రెండేళ్లుగా ఎదురైన విపత్కర పరిస్థితులు, వివిధ రకాల కంపెనీలు, ఉత్పాదకసంస్థల మూత, వ్యాపారాలు దెబ్బతినడంతో యువతరం క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. కెరీర్‌ ప్రారంభంలోనే దీర్ఘకాలం పాటు నిరుద్యోగులుగా గడపాల్సి వచ్చింది. దీని ప్రభావం దీర్ఘకాలం పాటు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి కరోనా వైరస్‌ వ్యాప్తి కంటే ముందునుంచే యువతలో నిరుద్యోగిత శాతం ఎక్కువగానే ఉండగా, మహమ్మారి కారణంగా అది మరింత తీవ్రరూపం దాల్చిందని ఆర్థికవేత్తలు వెల్లడించారు.  

30 లక్షల మంది మహిళల ఉపాధికీ కోత 
కోవిడ్‌ ఫస్ట్, సెకండ్‌వేవ్‌లలో లాక్‌డౌన్లు, ఆంక్షలు, నిబంధనలు ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపించడంతో పాటు యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్రమైన కోతకు ఆస్కారమేర్పడిందని చెబుతున్నారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే.. 2020–21లో 45 లక్షల మంది పురుషులు, 30 లక్షల మంది మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్టుగా సెంటర్‌ ఫర్‌ ఎకనమిక్‌ డేటా అనాలిసిస్, సీఎంఐఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.  ఈ పరిస్థితిపై ఆర్థికరంగ విశ్లేషకులు డి.పాపారావు, హెచ్‌ఆర్‌ నిపుణురాలు డాక్టర్‌ డి.అపర్ణారెడ్డి తమ అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు.  

ఆరు నెలల్లో మామూలు స్థితికి చేరుకోవచ్చు 
అత్యధిక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే ఈ–కామర్స్‌ ఇండస్ట్రీ, ఆతిథ్య, హోటల్, పర్యాటకం, తదితర అనుబంధ పరిశ్రమలు బాగా దెబ్బతినడం నిరుద్యోగిత శాతం పెరగడానికి ప్రధాన కారణం. కరోనా కాలంలో వివిధ రకాల పరిశ్రమలు దెబ్బతినడం, మూతపడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా ఉండకపోవచ్చు. వచ్చే ఆరునెలల్లో మామూలు స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత సాంకేతిక అవసరాలకు తగ్గట్టుగా తగిన నైపుణ్యాలు ఉన్న వారికి డిమాండ్‌ బాగానే ఉంటోంది. అయితే ఈ స్కిల్స్‌ ఉన్నవారు మన దగ్గర 5 నుంచి 10 శాతం లోపే ఉంటారు.  
–డాక్టర్‌ డి.అపర్ణా రెడ్డి, హెచ్‌ఆర్‌ నిపుణురాలు 

ఉద్యోగ, ఉపాధి రహిత వృద్ధి జరుగుతోంది 
నిరుద్యోగం పెరుగుదల అనేది ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామం. ఉత్పత్తి, సర్వీసు రంగాల్లో యాంత్రీకరణ, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ పద్ధతుల్లో నియామకాల పెరుగుదలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం ఉత్పత్తి రంగం లేకుండా బతికే స్థితికి చేరుకుంటున్నాం. ఉత్పత్తి లేకపోతే ఉద్యోగాలుండవు. దేశంలో తయారీ పరిశ్రమ (మాన్యుఫాక్చరింగ్‌ ఇండస్ట్రీ)లు వస్తున్నా ఉద్యోగాలు పెరగడం లేదు.

ఆటోమేషన్‌ దీనికి ప్రధాన కారణం. అలాగే కార్ల కంపెనీలు వస్తున్నా పెయింట్లు వేయడం మొదలు, అసెంబ్లింగ్‌ తదితర ఉత్పత్తి శ్రమను రోబోలే నిర్వహిస్తున్నాయి. మనుషులతో అవసరం లేకుండా యంత్రాలే చేసేస్తున్నాయి. ఇలా మూడు, నాలుగేళ్లుగా ఉపాధి రహిత అభివృద్ధి ఉండింది. తాజాగా ఉద్యోగ రహిత వృద్ధి అనేది వచ్చింది. ఉన్న ఉద్యోగాలు పోయే దశ ఇది. మరోవైపు ఉద్యోగాలు లేక కొనుగోలు శక్తి తగ్గి ఆర్థికరంగం కుచించుకుపోతుంది. ఈ పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులు, నామమాత్రం చదువుకున్న వారి కోసం పట్టణ ఉపాధి పథకాలు తీసుకురావాలి. లేనిపక్షంలో నిరుద్యోగ విస్ఫోటనం సంభవించే ప్రమాదం పొంచి ఉంది. 
– డి. పాపారావు, ఆర్థికరంగ విశ్లేషకుడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement