సాక్షి, హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిరుద్యోగుల సంఖ్య 5.10 కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత శాతంపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ మేరకు గణాంకాలు విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారత శ్రామికశక్తి 2022లో ఇంకా కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందున్న స్థాయికి చేరుకోలేదు.
2019లో శ్రామికశక్తి 44.2 కోట్లుగా ఉండగా దేశంలో కరోనా వ్యాప్తి సందర్భంగా 2020లో అది 42.4 కోట్లకు తగ్గింది. తిరిగి 2021లో 43.5 కోట్లకు పెరగ్గా తాజాగా ఈ ఏడాది నవంబర్ నాటికి 43.7 కోట్లకు శ్రామికశక్తి చేరుకుంది. 2019లో కరోనా వ్యాప్తికి ముందు 4.5 కోట్లుగా ఉన్న నిరుద్యోగులు, 2020లో 5.3 కోట్లకు, 2021లో 4.8 కోట్లకు 2022 నవంబర్‌లో 5.1 కోట్లకు చేరుకున్నారు.
ఈ గణాంకాలను బట్టి చూస్తే దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 11 శాతం దాకా నిరుద్యోగులు ఉన్నారనే విషయం వెల్లడైంది. అదే సమయంలో డిసెంబర్‌లో నిరుద్యోగిత శాతం 8.7 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో అత్యధికంగా 9.9 శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 8.1 శాతంగా ఉన్నట్లు సీఎంఐఈ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆర్థికరంగ విశ్లేషకుడు డి. పాపారావు తన అభిప్రాయాలు ‘సాక్షి’తో పంచుకున్నారు.
నిరుద్యోగితకు కారణాలు ఇవే...
►ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదు.
►కేంద్రంఅవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు దేశానికి నష్టం చేస్తున్నాయి.
►ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడానికి బదులు కార్పొరేట్లకు డబ్బులిస్తోంది.
►ప్రస్తుతమున్న పరిశ్రమలే 70 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. దీంతో ఉన్న ఉద్యోగాలనే తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అక్టోబర్‌లో ఈపీఎఫ్‌వో విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇలా చేస్తే మేలు...
►ప్రభుత్వ ఆర్థిక విధానాల మార్పుతోనే పరిస్థితులు మారతాయి.
►సాగులో డిమాండ్‌ను సృష్టించాలి.
►కనీస మద్దతు ధర పెంచాలి. చౌకగా విత్తనాలు, ఎరువులు అందించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.
►ఒక్క వ్యవసాయ సీజన్‌లో గుణాత్మక మార్పు తీసుకురాగలిగితే ఉపాధి కల్పనలో మార్పు దానంతట అదే వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment