కాగ్నిజెంట్‌ భారీ విస్తరణ! | Cognizant is a massive expansion in Telangana | Sakshi
Sakshi News home page

కాగ్నిజెంట్‌ భారీ విస్తరణ!

Published Tue, Aug 6 2024 6:21 AM | Last Updated on Tue, Aug 6 2024 6:21 AM

న్యూజెర్సీలో కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేశ్‌రంజన్‌ తదితరులు

హైదరాబాద్‌లో 10 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌

15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

అమెరికాలో సీఎం రేవంత్‌తో చర్చలు..విస్తరణ ప్రణాళికపై ఒప్పందం

హైదరాబాద్‌ టెక్‌ కంపెనీలకు గమ్యస్థానంగా మారుతుందన్న ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకు వచ్చింది. దాదాపు 15 వేల మంది ఉద్యోగు లకు పని కల్పించేలా, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్, కంపెనీ ఇతర ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా జరి గిన చర్చల అనంతరం కాగ్నిజెంట్‌ విస్తరణ ప్రణా ళికపై ఒప్పందం జరిగింది. వాస్తవానికి గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్‌ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నేపథ్యంలో కంపెనీ విస్తరణకు కాగ్నిజెంట్‌ ఈ నగరాన్ని ఎంచుకుంది. కాగా ఒప్పందం సందర్భంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. 

కాగ్నిజెంట్‌ కంపెనీ కొత్త సెంటర్‌ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్‌కు తమ ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్‌ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. 

క్లయింట్లకు మెరుగైన సేవలు
కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తామని పేర్కొన్నారు. 

ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డిజిటల్‌ ఇంజనీరింగ్, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర టైర్‌–2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ప్రముఖ టెక్‌ కంపెనీలన్నీ హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్‌ నిర్ణయం హైదరాబాద్‌ అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement