
సాక్షి, జడ్చర్ల టౌన్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆదివారం కామన్‌కుక్రి అనే అరుదైన పామును పట్టుకున్నారు. పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో ఓ వ్యాపారి ఇంట్లోకి పాము చొరబడగా ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సర్ప రక్షకుడు డాక్టర్ సదాశివయ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఆయన తన శిష్యుడు, బీజెడ్‌సీ విద్యార్థి రాహుల్‌ను పంపించగా.. ఆయన పామును పట్టుకుని కళాశాలకు తీసుకెళ్లారు.
కామన్‌కుక్రి పాము ప్రమాదకరం కాదని, అయితే అవి ఈ ప్రాంతంలో తక్కువ సంఖ్యలో సంచరిస్తాయని సదాశివయ్య చెప్పారు. కుక్రి పామును అంతరించిపోతున్న పాముల్లో ఒకటిగా ఐయూసీఎన్ (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్– అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంస్థ) గుర్తించింది. ఈ పాము ఎక్కువగా చెత్తాచెదారంలో ఉండి సాయంత్రం సమయంలో బయటకు వస్తుందని, విషరహిత సర్పమని పేర్కొన్నారు.
గ్రామంలోకి అడవిబర్రె
ఏటూరునాగారం (ములుగు జిల్లా) : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శివాపురం దట్టమైన అటవీప్రాంతం నుంచి అడవిబర్రె శనివారం గ్రామంలోకి వచ్చి హల్‌చల్ చేసింది. దానిని చూసి ఆందోళన చెందిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వగా...అధికారులు వచ్చి దానిని మళ్లీ అడవిలోకి పంపించారు. దారితప్పి గ్రామంలోకి వచ్చిందని, ఎవరూ ఆందోళన చెందనవసరంలేదని అటవీ అధికారులు సూచించారు.