ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఓకే.. కానీ ‘మూడేళ్ల పనితీరు’ మెలిక | Compassionate Appointments in TSRTC Consolidated Pay Condition | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఓకే.. కానీ ‘మూడేళ్ల పనితీరు’ మెలిక

Published Fri, Jul 8 2022 3:10 PM | Last Updated on Fri, Jul 8 2022 3:24 PM

Compassionate Appointments in TSRTC Consolidated Pay Condition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు (బ్రెడ్‌ విన్నర్‌ స్కీం) లైన్‌ క్లియర్‌ అయింది. ఉద్యోగం చేస్తూ మరణించిన, అనారోగ్య సమస్యలతో అన్‌ఫిట్‌ అయినవారి వారసులను అర్హతల ఆధారంగా ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు పచ్చజెండా ఊపింది. కానీ నేరుగా పూర్తిస్థాయి ఉద్యోగాల్లోకి తీసుకోకుండా.. ‘మూడేళ్ల పనితీరు’ నిబంధన పెట్టింది. వారసులను మూడేళ్లపాటు కన్సాలిడేటెడ్‌ పే (కనీస స్థిర వేతనం చెల్లింపు) పద్ధతిన తాత్కాలికంగా నియమించుకుని.. ఆ తర్వాత పనితీరు బాగుంటే రెగ్యులర్‌ చేయనుంది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో.. ఈ నియామకాలను కూడా పోస్టులు ఖాళీ అయ్యే కొద్దీ, విడతల వారీగా చేపట్టాలని నిర్ణయించింది. ఆర్టీసీలో ప్రస్తుతం 1,350 మంది ఉద్యోగుల కుటుంబాలు కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్నాయి. 

మూడేళ్ల తాత్కాలిక నియామకాలతో..
ఆర్టీసీలో గతంలో కారుణ్య నియామకాలు చేపట్టినప్పుడు ఉద్యోగులకు నేరుగా పేస్కేల్‌ను వర్తింపజేసేవారు. ఇప్పుడు తొలి మూడేళ్లపాటు తాత్కాలిక పద్ధతిన నియమించనున్నారు. మూడేళ్ల తర్వాత పనితీరు మెరుగ్గా ఉంటే కొనసాగిస్తారు. పనితీరు కొలమానానికి సంబంధించి 38 అంశాలతో జాబితాను కూడా విడుదల చేశారు. మూడేళ్లపాటు ఏటాకనీసం 240 పనిదినాలకు తక్కువ కాకుండా విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత వారి పనితీరును అంచనా వేసేదుకు టెస్ట్‌ నిర్వహిస్తారు. అందులో 60 శాతం సానుకూలత సాధించాల్సి ఉంటుంది. లేకుంటే విధుల్లో కొనసాగించరు.
చదవండి: జేఎన్‌టీయూహెచ్‌లో విద్యార్థి సంఘాల ఘర్షణ

2018 నుంచి ఎదురుచూపులు
ఆర్టీసీలో చివరిసారిగా నాలుగేళ్ల కింద కారుణ్య నియామకాలు చేశారు. అప్పటి నుంచి దాదాపు 1,095 మంది ఉద్యోగులు చనిపోగా.. వెయ్యి మంది వారసులు, అనారోగ్య సమస్యలతో అన్‌ఫిట్‌ అయిన డ్రైవర్ల కుటుంబాలకు సంబంధించి 255 మంది ‘కారుణ్యం’ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 80మందికి ఎంపిక ప్రక్రియ, శిక్షణ పూర్తిచేసినా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఆ సమయంలోనే ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె పరిస్థితి తారుమారు అయింది. ఖర్చు తగ్గించే పేరిట వెయ్యికిపైగా బస్సులను తొలగించి, అద్దె బస్సులను తీసుకోవడంతో సిబ్బంది మిగిలిపోయారు. దీనికితోడు రిటైర్మెంట్‌ వయసును 60 ఏళ్లకు పెంచడంతో రెండేళ్ల పాటు రిటైర్మెంట్లు లేకుండా పోయాయి. దీంతో కారుణ్య నియామకాలు అటకెక్కాయి. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

తగిన అర్హతల ఆధారంగా..
వారసులలో అర్హతల ఆధారంగా.. గ్రేడ్‌–2 డ్రైవర్, గ్రేడ్‌–2 కండక్టర్, శ్రామిక్, ఆర్టీసీ కానిస్టేబుల్‌ పోస్టుల్లో ఒక దానికి ఎంపిక చేస్తారు. నెలకు డ్రైవర్‌కు రూ.19 వేలు, కండక్టర్‌కు రూ.17 వేలు, మిగతా రెండు పోస్టులకు రూ.15 వేల చొప్పున కన్సాలిడేటెడ్‌ పేను ఖరారు చేశారు. సంస్థలో ఖాళీలు ఏర్పడే కొద్దీ వీరికి పోస్టింగ్‌ ఇస్తారు.ఇప్పటికే ఎంపికై ఎదురు చూస్తున్న వారికి ముందుగా పోస్టింగ్‌ ఇస్తారు. మిగతావారిలో మొదట చనిపోయిన ఉద్యోగుల వారసులకు ముందుగా అనే విధానంలో పోస్టింగ్‌ చేపడతారు. విధి నిర్వహణలో భాగంగా బస్సుల్లో/సంస్థ ప్రాంగణాల్లో ఉండి.. ప్రమాదాలు, గుండెపోటు, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలతో చనిపోయినవారి వారసులకు సీనియారిటీతో సంబంధం లేకుండా ముందుగా పోస్టింగ్‌ ఇస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement