ఈ రెండు అంశాల్లో జాగ్రత్తగా ముందుకెళ్లాలంటున్న టీపీసీసీ
హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
కూల్చివేతలపై అవగాహన, పరిహారంగురించి ప్రజలకు వివరించడంపై చర్చ
అన్ని విషయాలతో కాంగ్రెస్ పార్టీ పక్షాన సీఎం రేవంత్‌కు సమగ్ర నివేదిక
సాక్షి, హైదరాబాద్: హైడ్రా, మూసీ సుందరీకరణ ప్రాజెక్టులపై ఆచితూచి ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులను చేపట్టడంలో ఎలాంటి అభ్యంతరం లేదని.. కచ్చితంగా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందేనని టీపీసీసీ నేతలు అంటున్నారు. కానీ వీటి అమల్లో ముందుకెళ్లే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కొందరు హైదరాబాద్ సిటీ ఎమ్మెల్యేలతో మాట్లాడారని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
హైడ్రా కూల్చివేతలు, మూసీ సుందరీకరణ పట్ల ప్రజల్లో సానుకూల స్పందన ఉందని, ప్రభుత్వానికి అభినందనలు అందుతున్నాయని.. కానీ ప్రజలకు ఈ అంశాల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు, నేతలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలో కూల్చివేతల వలన కలిగే ప్రయోజనాలు, పరిహార ప్యాకేజీల గురించి ప్రజలకు క్షుణ్నంగా వివరించాలని ప్రభుత్వానికి సూచించాలని టీపీసీసీ నిర్ణయించింది.
ఈ అంశంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం చురుగ్గా వ్యవహరించాల్సి ఉంటుందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ టీపీసీసీ పక్షాన ప్రత్యేక నివేదికను సిద్ధం చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. త్వరలోనే సీఎం రేవంత్‌ను కలిసి నివేదిక ఇస్తారని వెల్లడించారు.
హరీశ్‌రావు తొలుత మల్లన్నసాగర్ బాధితులను ఓదార్చాలి
మూసీ సుందరీకరణ, హైడ్రా కూల్చివేతల వల్ల పేదలకు నష్టం జరుగుతోందని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి హరీశ్‌రావు కన్నీరు పెట్టుకున్నారన్న అంశంపై మహేశ్‌గౌడ్ స్పందించారు. హరీశ్‌రావు ఓదార్చాల్సింది హైదరాబాద్‌లో కాదని.. సొంత జిల్లాకు వెళ్లి మల్లన్నసాగర్ బాధితులను ఓదార్చాలని సూచించారు. ఇన్నాళ్లూ మల్లన్నసాగర్ బాధితుల కన్నీళ్లు హరీశ్‌రావుకు కనిపించలేదా? అని ప్రశ్నించారు.
నాడు మల్లన్నసాగర్ బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అడ్డుకుని అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మూసీ నదిపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. మూసీ ప్రక్షాళన జరిగితే నదీ పరీవాహకంలో ఉన్న రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సాగునీరు పెరుగుతుందని చెప్పారు. హైడ్రా, మూసీ అభివృద్ధితో కొంతమంది సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని.. హైదరాబాద్ మొత్తానికి లాభం జరుగుతుందని మహేశ్‌గౌడ్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment