తెలంగాణలో వ్యాక్సిన్‌ అందేనా? | Confused Over Third Installment Vaccination In Telangana | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ అందేనా? మూడో విడత వ్యాక్సినేషన్‌పై అయోమయం!

Published Thu, Apr 29 2021 1:15 AM | Last Updated on Thu, Apr 29 2021 8:49 AM

Confused Over Third Installment Vaccination In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  కోవిడ్‌ మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సందిగ్ధంలో పడింది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ నిల్వలు ఖాళీకావడం, కేంద్రం నుంచి మరిన్ని వ్యాక్సిన్లు రావడంపై స్పష్టత లేకపోవడంతో.. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన మూడో విడత వ్యాక్సినేషన్‌పై అయోమయం నెలకొంది. ఇప్పటివరకు 45 ఏళ్లు నిండిన వారికే వ్యాక్సిన్‌ ఇవ్వగా.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

జనం భారీగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నా.. వారికి టీకాలు ఎప్పుడు అందుతాయన్నది మాత్రం ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు ఫ్రంట్‌లైన్‌/హెల్త్‌ వర్కర్లు, 45 ఏళ్లపైన వయసున్నవారు కలిపి సుమారు 43.89 లక్షల మందికి వ్యాక్సిన్లు వేయగా.. ఇందులో రెండు డోసులూ తీసుకున్నవారు ఐదున్నర లక్షల మందే. మిగతా వారికి రెండో డోసు వేయడానికే ఏకంగా 38 లక్షల డోసుల వ్యాక్సిన్‌ కావాలి. వీరందరికీ ఇచ్చాకే.. 18 –45 ఏళ్ల మధ్య వయసువారికి టీకాలు అందుతాయి. అది ఎప్పుడనేదానిపై స్పష్టత లేదు. 

నిల్వ లక్ష డోసులే! 
రాష్ట్రంలో రోజుకు సగటున లక్ష మందికి కోవిడ్‌ టీకాలు వేస్తున్నారు. నాలుగైదు రోజుల క్రితం గరిష్టంగా రోజుకు రెండు లక్షలకుపైబడి వ్యాక్సిన్లు వేశారు. ప్రస్తుతం వ్యాక్సిన్‌ స్టాకు దాదాపు ఖాళీ అయింది. బుధవారం సాయంత్రం సమయానికి రాష్ట్రంలో లక్ష డోసులు మాత్రమే నిల్వ ఉన్నట్లు ప్రజారోగ్య విభాగం సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. వీటిని పంపిణీ చేస్తే ఒకటిరెండు రోజుల్లో మొత్తంగా ఖాళీ అవుతుంది. కేంద్రం వ్యాక్సిన్లు ఎప్పుడు వస్తాయన్న అంశంపై స్పష్టత కొరవడింది. కొత్తగా వ్యాక్సిన్‌ బుకింగ్‌పైనా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితిలో శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో విడత వ్యాక్సినేషన్‌పై అధికార యంత్రాంగంలో అయోమయం కనిపిస్తోంది. 

కేవలం రిజిస్ట్రేషన్‌తోనే సరి.. 
మూడో విడత వ్యాక్సినేషన్‌కు సంబంధించి బుధవారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 18 ఏళ్లు నిండిన వారంతా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. సాధారణంగా రిజిస్ట్రేషన్‌ పూర్తికాగానే వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రం, సమయం వివరాలు వస్తాయి. ఆ సమయానికి సదరు కేంద్రానికి వెళ్లి టీకా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న మూడో విడత వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌లో.. టీకా ఇచ్చే తేదీ, సమయం కనిపించవని, టీకాల కొరతే దీనికి కారణమని వైద్యారోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ప్రస్తుతమున్న టీకా నిల్వలతోపాటు రాబోయే టీకాల పంపిణీలో సైతం రెండో డోసు వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 45ఏళ్లు పూర్తయిన వారికి కూడా తొలి డోసు వ్యాక్సిన్‌ పంపిణీపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రైవేటులోనూ తేలడం లేదు.. 
రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఇంకా తుది విధి విధానాలు రూపొందించలేదు. 18 ఏళ్లుపైబడిన వారికి వ్యాక్సిన్లు ఎప్పుడు వేస్తారన్నది ప్రకటించలేదు. మరోవైపు ప్రైవేట్‌ ఆస్పత్రులు నేరుగా కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసి.. మే ఒకటో తేదీ నుంచి ప్రజలకు వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ప్రైవేట్‌ ఆస్పత్రులు ఏ మేరకు వ్యాక్సిన్లకు ఆర్డర్‌ చేశాయన్న వివరాలు వెల్లడి కాలేదు. 
 
రాష్ట్రంలో ఇప్పటివరకు 43.98 లక్షల మందికి.. 
రాష్ట్రంలో జనవరి 16 నుంచి కోవిడ్‌ టీకాల పంపిణీ ప్రారంభమైంది. తొలుత ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, తర్వాత 60 ఏళ్లు నిండిన వారికి, 45 ఏళ్లు నిండి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి పంపిణీ చేశారు. ఆ తర్వాత 45 ఏళ్లపై వయసున్న అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8గంటల వరకు 43,89,489 మందికి టీకా వేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు 38,48,591 మందికాగా.. రెండు డోసులూ తీసుకున్న వారు 5,49,898 మంది ఉన్నారు. అంటే తొలిడోసు తీసుకున్నవారికి రెండో డోసు వేసేందుకే.. 38 లక్షలకుపైగా వ్యాక్సిన్లు అవసరం. ఇక వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వివిధ కారణాలతో 1.29 శాతం వ్యాక్సిన్‌ వృథా అయినట్టు వైద్య శాఖ తెలిపింది. 

రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ తీరు ఇదీ.. 
కేటగిరీ                                               ప్రభుత్వ        ప్రైవేటు 
టీకా కేంద్రాలు                                       1,165        236 
45 ఏళ్లుపైబడినవారికి                     29,39,358        7,18,533 
హెల్త్‌కేర్‌ వర్కర్స్‌                               4,12,024       10,490 
ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌                             3,15,166       2,918 
మొత్తం                                        36,66,548       7,31,941 

వ్యాక్సిన్‌ లభ్యత ఆధారంగానే పంపిణీ  
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇప్పటివరకు 46.5 లక్షల వ్యాక్సిన్‌ డోసులు పంపిందని.. ఇప్పటివరకు 45లక్షల డోసులు వినియోగించామని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఒకరోజుకు సరిపడా నిల్వలే ఉన్నాయన్నారు. రెండో డోసు కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తామని.. ఇంకా వ్యాక్సిన్‌ తీసుకోని 45 ఏళ్లుపైబడిన వారికి తొలి డోసు ఇవ్వడం కూడా టీకా లభ్యతపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై విధివిధానాలను ఒక ట్రెండు రోజుల్లో ఖరారు చేస్తామన్నారు. 18 ఏళ్లు దాటినవారు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నా.. వారికి వ్యాక్సిన్‌ ఇచ్చే తేదీ, సమ యం స్లాట్‌ అందుబాటులో ఉండదని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ లభ్యత ఉంటే.. కేంద్ర నిబంధనల మేరకు వారు వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వా లని నిర్ణయించిందని.. విడతల వారీగా కేంద్రా లను పెంచుతూ, లభ్యత ఆధారంగా టీకాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. మే 1 నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులకు తాము వ్యాక్సిన్‌ సరఫరా చేయబోమని, ఇప్పటికే వారికిచ్చిన డోసుల్లో ఎన్ని వాడారో పరిశీలించి.. మిగిలి ఉంటే వెనక్కి తీసుకుంటామని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement