సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టించాయి. ఈ ఉప ఎన్నికల వేళ కీలక నేతలు రాజకీయ పార్టీలు మారారు. దీంతో, ఊహించని విధంగా ట్విస్టులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎన్నికల సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, గత నెల 22వ తేదీన ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు పంపించింది. అయితే, తనకు ఆ నోటీసులు అందలేదన్నారు. దీంతో, తాజాగా ఏఐసీసీ మరోసారి నోటీసులు పంపింది. ఇక, నోటీసుల్లో భాగంగా 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోమటిరెడ్డిని కోరింది.
ఇక, తాను ప్రచారం చేసినా కాంగ్రెస్ గెలువదు అంటూ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. అంతకుముందు కూడా.. మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరినట్లు లీకైన ఆడియోలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి మద్దతు తెలపకుండా బీజేపీ అభ్యర్థికి ఓట్లేయాని చెప్పడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఈ ఘటనపై పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ తీవ్రంగా స్పందించారు. ఏఐసీసీ క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో, ఎంపీ వెంకట్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇక, ఈసారి కూడా కోమటిరెడ్డి స్పందించకపోతే.. ఆయనపై సీరియస్ చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment