ప్రజాగ్రహంతో పేదల ఇళ్ల జోలికి వెళ్లే విషయంలో ప్రభుత్వం పునరాలోచన
దూకుడు తగ్గించి ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్న సర్కారు
ప్రతిపక్షాల నిరసనలు, సొంత పార్టీలో ప్రతికూలత పరిగణనలోకి.. రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం
ప్రస్తుతానికి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల వరకే పరిమితమయ్యే అవకాశం
హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు,బడాబాబుల ఫామ్‌హౌస్‌లపై చర్యలు!
సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా జాగ్రత్తలు
మూసీ నిర్వాసితులకు పునరావాసంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రత్యేక కార్యాచరణ దిశగా అడుగులు
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన విషయాల్లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ మార్కింగ్ పేరుతో మూసీపై చేస్తున్న హడావుడిని ప్రస్తుతానికి నిలిపివేయాలని, దూకుడు తగ్గించాలని సర్కారు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని, హైడ్రా ఏర్పాటు చేసి పెద్దల జోలికి వెళ్లకుండా దశాబ్దాలుగా నివాసముంటున్న తమపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందంటూ పేదలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతుండటంతో జాగ్రత్త పడాలని నిర్ణయించినట్లు తెలిసింది.
చెమటోడ్చి సంపాదించుకున్న నివాసాలను నేలమట్టం చేసి తమ బతుకులను ప్రభుత్వం రోడ్డుపైకి తెస్తోందనే భావన సామాన్య ప్రజల్లో క్రమంగా బలపడుతుండడంతో ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు కూడా హైడ్రా, మూసీ విషయాల్లో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం, పేదలు..మధ్యతరగతి వారి ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, సొంత పార్టీలో సైతం కొంత ప్రతికూలత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వెనక్కు తగ్గాలనే నిర్ణయానికి వల్చినట్లు తెలిసింది. అన్ని కోణాలను బేరీజు వేసుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.
పేదలను ఒప్పించి, మెప్పించాకే..
మూసీ నదిపై ఉన్న ఆక్రమణల తొలగింపు రాజకీయంగా వివాదాస్పదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే వారితో మాట్లాడి పునరావాస ప్యాకేజీపై వారిని ఒప్పించి మెప్పించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని, ఆ తర్వాతే అడుగులు ముందుకేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతానికి చెరువుల ఆక్రమణలు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల వరకే కార్యాచరణను పరిమితం చేయాలని, హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు, బడాబాబుల ఫామ్‌హౌస్‌లపై చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వల్చినట్టు సమాచారం.
రుణాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు
మూసీ నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై విస్తృత ప్రచారం చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు బాహాటంగానే మాట్లాడుతుండటం గమనార్హం. పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని, పరిహార ప్యాకేజీని అమలు చేస్తామని, బ్యాంకర్లతో రుణాలిప్పిస్తామంటూ హామీ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.
పీసీసీ కూడా దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని భావిస్తోంది. వీటితో పాటు, ముఖ్యంగా పునరావాసంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించకుండా ముందుకెళ్లడం మంచి కన్నా ఎక్కువగా చెడు చేస్తుందని, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించనున్నట్లు తెలిసింది.
రుణాల విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను సమాయత్తం చేస్తున్నట్టు సమాచారం. అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఇదే కోణంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment