సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ చాన్స్ ఎవరికి అన్నదానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఢిల్లీ వేదికగా పలుమార్లు భేటీలు జరిగినా.. అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని గాందీభవన్ వర్గాలు చెప్తున్నా.. అభ్యర్థులు ఎవరనే దానిపై ఆదివారం రాత్రి వరకు కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నెల 18లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సిన నేపథ్యంలో.. సోమవారం లేదా మంగళవారం (16న) అభ్యర్థులను ప్రకటించవచ్చని సమాచారం.
ఎవరెవరికి చాన్స్?
తుంగతుర్తి అసెంబ్లీ టికెట్‌ను త్యాగం చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఉద్యమకారుడు అద్దంకి దయాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఇద్దరూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైనట్టు గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే సమయంలో మైనార్టీ నేతను ఎమ్మెల్సీగా చట్టసభకు పంపి కేబినెట్ అవకాశం ఇవ్వాలనే కోణంలో మాజీ మంత్రి షబ్బీర్‌అలీ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు జరిపిన చర్చల్లో.. ఇందులో ఇద్దరు పేర్లను ఖరారు చేశారని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆ రెండు అభ్యర్థిత్వాలపైనా చర్చ
ఇక గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న మరో రెండు ఎమ్మెల్సీ పదవులపైనా కాంగ్రెస్ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ కోటాలో ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం పేరును పరిశీలిస్తున్నారనే చర్చ జరుగుతున్నా.. రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న ఆయన అభ్యర్థిత్వానికి గవర్నర్ ఆమోదం విషయంలో ఇబ్బంది రావొచ్చనే చర్చ జరిగినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కోదండరాంకు అవకాశం దక్కుతుందని అంటున్నారు.
వీలుంటే ఇప్పుడు లేదంటే మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఆయనను శాసన మండలికి పంపుతారని.. సాంకేతిక సమస్యలను అధిగమించగలిగితే గవర్నర్ కోటాలోనే సిఫార్సు చేయవచ్చని తెలిసింది. మరోవైపు గవర్నర్ కోటాలో మైనార్టీలకు అవకాశం కల్పించే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తోంది. ఈ కోటా కింద హైదరాబాద్ కేంద్రంగా విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జాఫర్ జావేద్, సియాసత్ పత్రిక ఎడిటర్ జాహెద్ అలీఖాన్‌ల పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. అయితే గతంలో తనకు వచ్చిన రాజ్యసభ అవకాశాన్ని జాహెద్ అలీఖాన్ తిరస్కరించిన నేపథ్యంలో.. ఆయన కుమారుడు అమేర్‌అలీఖాన్‌ను ఎంపిక చేయవచ్చని అంటున్నారు.
ఆ రెండు దాదాపు ఖరారేనా?
మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి జి.చిన్నారెడ్డి పేరు దాదాపు ఖరారు చేయగా.. నల్లగొండ–వరంగల్–ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ అభ్యర్థిగా గత ఎన్నికల్లో ఓటమి పాలైన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ప్రస్తుతానికి రెండు ఎమ్మెల్యే కోటా పేర్లను మాత్రమే ప్రకటిస్తారని, సమయాన్ని బట్టి మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటిస్తారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
నామినేటెడ్ పదవుల టెన్షన్
రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సంక్రాంతికి ముందే ఈ పోస్టులను భర్తీ చేస్తారని గతంలో చర్చ జరిగినా కసరత్తు ఓ కొలిక్కిరాలేదు. తొలిదశలో పది వరకు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటిస్తారని భావించారు. తర్వాత ఈ సంఖ్య 18కి చేరింది. ఈ క్రమంలో తొలిదఫాలో 9 లేదా 18 కార్పొరేషన్ల పదవులను ఈ నెల 20 తర్వాత ప్రకటిస్తారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
సామాజిక కోణంలోనూ సరిపడేలా ఎస్సీ సెల్ చైర్మన్ నాగరిగారి ప్రీతం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, టీపీసీసీ ఫిషర్‌మెన్ సెల్ చైర్మన్ మెట్టుసాయికుమార్‌లకు తొలిదఫాలోనే అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే ఎవరికి, ఏ కార్పొరేషన్ ఇస్తారన్న అంశం బయటికి రాకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది. మహిళల కోటా కింద తొలిదఫాలో మాజీ మంత్రి పుష్పలీలకు అవకాశం రావొచ్చని, ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల జాబితా ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీకి చేరిందని అంటున్నాయి.
ఎమ్మెల్సీలు@ సస్పెన్స్
Published Mon, Jan 15 2024 12:26 AM | Last Updated on Mon, Jan 15 2024 4:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment