అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు! | Congress Party Showing Aggression In Munugodu By Elections | Sakshi
Sakshi News home page

అటు బుజ్జగింపులు.. ఇటు బాధ్యతలు!

Published Sun, Sep 11 2022 2:59 AM | Last Updated on Wed, Sep 14 2022 3:17 PM

Congress Party Showing Aggression In Munugodu By Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌.. అదే దూకుడుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో.. టికెట్‌ ఆశించిన ముగ్గురు నాయకులను బుజ్జగించే పనిలో పడింది. వారికి ప్రచార బాధ్యతలనూ అప్పగించింది. మునుగోడు టికెట్‌ ఆశించిన చల్లమల్ల కృష్ణారెడ్డి, స్రవంతిలతో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి శనివారం తన నివాసంలో భేటీ అయి చర్చించారు.

మరో ఇద్దరు నేతలు పల్లె రవికుమార్, పున్నా కైలాశ్‌ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ అభ్యర్థి స్రవంతి గెలుపు కోసం అంతా పనిచేయాలని.. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామని బుజ్జగించారు. రేవంత్‌ విజ్ఞప్తి పట్ల ముగ్గురు నేతలు సానుకూలంగా స్పందించారని, స్రవంతి అభ్యర్థిత్వానికి మద్దతిస్తూ, కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని గాంధీ భవన్‌ వర్గాలు తెలిపాయి.

గాంధీ భవన్‌లోనూ కీలక భేటీ
శుక్రవారం స్రవంతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో కీలక భేటీ నిర్వహించింది. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు ముఖ్య నేతలు బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, చెరుకు సుధాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్, మహేశ్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, సంపత్‌ కుమార్, బలరాం నాయక్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉప ఎన్నిక ప్రచార కార్యాచరణపై చర్చించిన టీపీసీసీ నేతలు.. మండలాల వారీగా ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఇప్పటికే మండలానికి ఇద్దరు రాష్ట్ర నేతలను ఇన్‌చార్జులుగా ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీ.. మండలానికో ముఖ్య ఇన్‌చార్జిని నియమించింది. ఇప్పటికే ఉన్న నేతలు వీరికి సహాయకులుగా ఉంటారని పేర్కొంది. ఈ ఇన్‌చార్జుల జాబితాలో రేవంత్‌తోపాటు ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌అలీ ఉన్నారు.

ఇక నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో ప్రచార బాధ్యతలను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులకు అప్పగించారు. నియోజకవర్గంలోని 300 పోలింగ్‌ బూత్‌లకు గాను 150 మందిని (ప్రతి రెండు బూత్‌లకు ఒకరిని), ప్రతి పది బూత్‌లకు ఒకరిని ఇన్‌చార్జులుగా నియమించాలని నిర్ణయించారు. ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని.. మునుగోడులో క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు.

ఇదీ చదవండి: అచేతనావస్థలో ఆ రెండు పార్టీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement