నష్టాలను తప్పించుకునేందుకు కరోనా సాకు | Corona Impact: South Central Railway Yet to Run Passenger Trains | Sakshi
Sakshi News home page

నష్టాలను తప్పించుకునేందుకు కరోనా సాకు

Published Mon, Aug 30 2021 7:14 PM | Last Updated on Mon, Aug 30 2021 7:16 PM

Corona Impact: South Central Railway Yet to Run Passenger Trains - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణతో వచ్చే నష్టాలను కొంతమేర తగ్గించుకునేందుకు రైల్వేశాఖ కోవిడ్‌ బూచిని సాకుగా వాడుకుంటోంది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి, ఆంక్షలు ఎత్తివేసి చాలా రోజులైనా ఈ రైళ్లను పట్టాలెక్కించకపోవడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పేరుతో సాధారణ రైళ్లను ప్రారంభించి రిజర్వేషన్‌ టికెట్లతో ప్రయాణాలకు అనుమతించిన రైల్వేశాఖ, తాజాగా అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌నూ ప్రారంభించింది. కానీ, ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం షురూ చేయడం లేదు.

ప్యాసింజర్‌ రైళ్లను ప్రారంభిస్తే కరోనా కేసులు విస్తరించే అవకాశం ఉందని, అందుకే వాటిని ప్రారంభించడం లేదని రైల్వేశాఖ పేర్కొంటోంది. సిటీ బస్సులు, మెట్రో సర్వీసులు, సాధారణ బస్సులు, అన్‌రిజర్వ్‌డ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, ప్రార్థన మందిరాలు, ఉత్సవాలు, బహిరంగ సభలు, పెళ్లిళ్లుపేరంటాలు.. ఇలా వేటివల్లా విస్తరించని కరోనా, ప్యాసింజర్‌ రైళ్లతోనే వ్యాపిస్తుందన్న వాదన వింతగా కనిపిస్తున్నాయి. ఈ రైళ్లు లేకపోవటంతో అల్పాదాయ ప్రయాణికులు ఎక్కువ ధర చెల్లించి ఇతర ప్రయాణ సాధనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. (చదవండి: సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లు: బడి బండి భద్రమేనా?)


నిర్వహణ వ్యయం ఎక్కువే.. 

ప్యాసింజర్‌ రైళ్ల టికెట్‌ ధరల్లో ప్రయాణికులపై 30 శాతమే భారం పడుతోందని, 70 శాతాన్ని రైల్వేనే రాయితీగా భరిస్తోందని రైల్వేశాఖ స్పష్టం చేస్తోంది. సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఈ రాయితీ 55 శాతం వరకు ఉందని పేర్కొంటోంది. అలాగే, ప్యాసింజర్‌ రైళ్లకు హాల్టులు ఎక్కువ. ప్రయాణికులున్నా.. లేకున్నా.. నిర్ధారిత స్టేషన్‌లో కచ్చితంగా ఆగాల్సిందే. ఇలా రైలును ఆపి మళ్లీ పరిగెత్తించేందుకు డీజిల్‌/విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో చమురు/కరెంట్‌ ఛార్జీ భారం పెరుగుతుంది. 400 కి.మీ. దూరం ఉండే గమ్యం చేరటంలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నాలుగైదు స్టేషన్‌లకు మించి ఆగవు. కానీ, 150 కి.మీ. దూరంలో ఉండే ప్రాంతానికి వెళ్లే ప్యాసింజర్‌ రైళ్లు 15 నుంచి 18 వరకు స్టేషన్‌ల్లో ఆగుతాయి. ఇది నిర్వహణ ఖర్చును పెంచేందుకు కారణమవుతోంది. టికెట్‌ ధరలు చవక, నిర్వహణ వ్యయం ఎక్కువతో ప్యాసింజర్‌ రైళ్లు భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. 


రావాల్సింది రూ.900 కోట్లు.. వస్తోంది రూ.400 కోట్లు.. 

దక్షిణమధ్య రైల్వేకు కోవిడ్‌కు ముందు నెలకు రూ.400 కోట్ల మేర టికెట్‌ రూపంలో ఆదాయం వచ్చేది. ఇందులో ప్యాసింజర్‌ రైళ్లతో వచ్చేది రూ.60 కోట్లు మాత్రమే. నష్టాలు లేకుండా బ్రేక్‌ ఈవెన్‌ రావాలంటే ఈ ఆదాయం రూ.900 కోట్ల వరకు ఉండాలి. అంటే.. అంతమేర నష్టాలొస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంత నష్టాలొస్తున్నా.. సరుకు రవాణా రైళ్లతో సమకూరుతున్న భారీ వసూళ్లతో దీన్ని కొంత పూడ్చుకుంటోంది. కోవిడ్‌ కారణంగా లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ప్యాసింజర్‌ రైళ్లను గతేడాది మార్చి ఆఖరున నిలిపేశారు. ఆ తర్వాత వాటిని ప్రారంభించలేదు. కానీ, దశలవారీగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండగ ప్రత్యేక రైళ్లుగా తిప్పుతూ ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రారంభించారు. అవి కిక్కిరిసి ప్రయాణికులతో పరుగుపెడుతున్నాయి.  

ఇదిలా ఉండగా, ప్రస్తుతం దేశం మొత్తమ్మీద కేరళ మినహా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కువ కరోనా కేసులు నమోదు కావడం లేదు. మూడో వేవ్‌ వస్తుందన్న హెచ్చరికలున్నా.. దేశంలో ఎక్కడా కఠిన నియంత్రణలు, ఆంక్షలు లేవు. కానీ, ఒక్క ప్యాసింజర్‌ రైళ్ల విషయంలోనే ఏడాదిన్నరగా ఆంక్షలు కొనసాగిస్తుండటం విడ్డూరంగా కనిపిస్తోంది. కనీసం వాటిని ఎప్పుడు ప్రారంభిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు నుంచి జోన్లకు కనీస సమాచారం కూడా లేదు. 


► దక్షిణమధ్య రైల్వే పరిధిలో నిత్యం నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు: 350
► ప్యాసింజర్‌ రైళ్లు: 200
  
► నిత్యం జోన్‌ పరిధిలో ప్రయాణించేవారు: 10.5 లక్షలు 
► వీరిలో అన్‌రిజర్వ్‌డ్‌ బోగీల్లో ఎక్కేవారు: 8 లక్షలు 

► నిత్యం టికెట్ల ద్వారా సమకూరే ఆదాయం: రూ.12–15 కోట్లు  
► ఈ మొత్తంలో ప్యాసింజర్‌ రైళ్ల వాటా: రూ.3 కోట్లలోపే 

► ప్యాసింజర్‌ రైలు టికెట్‌పై రూపాయికి 70 పైసల నష్టం వాటిల్లుతోంది.. ఇదీ రైల్వే మాట. 

► కోవిడ్‌ ఆంక్షల పేరుతో ఏడాదిన్నరగా ప్యాసింజర్‌ రైళ్ల సిబ్బంది జీతాలు మినహా నిర్వహణ నష్టాలన్నీ ఆగిపోయాయి.  

► టికెట్‌ ఆదాయం కూడా ఆగినా.. అది నామమాత్రమే.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement