సాక్షి, హైదారబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్‌వేవ్ విజృంభిస్తోంది. దీంతో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే సెకండ్ వేవ్ కరోనా వైరస్‌పై ప్రత్యేక కథనం..
ఎప్పుడు పరీక్షలు చేసుకోవాలి?
లక్షణాలు ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవాలి.
ఇప్పటివరకు ఉన్న లక్షణాలు: జ్వరం, ఒళ్లు నొప్పులు, వాసన లేక రుచి లేకపోవడం, చలి ఉండటం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది
కొత్త లక్షణాలు:
► కళ్లు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారడం, విరేచనాలు, తాత్కాలికంగా వినికిడి శక్తి కోల్పోవడం
► పాజిటివ్ రోగితో అత్యంత సమీపంలో ఉండటం, ఆరడుగుల దూరంలో కూడా కనీసం 15 నిమిషాలు కలసి ఉంటే పరీక్ష చేయించుకోవాలి.
ఏ పరీక్ష చేయించుకోవాలి?
► ఆర్‌టీపీసీఆర్ అత్యంత కీలకమైన నిర్ధారణ పరీక్ష. ర్యాపిడ్ యాంటీజెన్ అప్పటికప్పుడు నిర్ధారణ చేసుకునే పరీక్ష. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ ఉంటే కరోనా నూటికి నూరు శాతం నిర్ధారణ అయినట్లే. మళ్లీ ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి్సన అవసరం లేదు. ర్యాపిడ్‌లో నెగెటివ్ వచ్చి
లక్షణాలుంటే, ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయాల్సి ఉంటుంది.
రెమిడెసివిర్ ఇంజెక్షన్
అత్యవసర సమయంలో వాడకానికి మాత్రమే దీనికి అనుమతి ఉంది. పైగా ట్రయల్స్ జరుగుతున్నాయి. దీనికి మరణాలను ఆపగలిగే శక్తిలేదు.
ఎప్పుడు వాడాలి?
► ఆర్‌టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన వారికి
► రక్తంలో ఆక్సిజన్ సంతృప్త శాతం 90 శాతం ఉండి, వెంటిలేటర్ లేదా ఆక్సిజన్‌పై చికిత్స చేస్తున్నప్పుడు.
► ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉన్నప్పుడు
► పైన పేర్కొన్న పరిస్థితులున్నప్పుడు మొదటి 9 రోజుల్లోనే రెమిడెసివిర్ ఇవ్వాలి. ఎందుకంటే వైరస్ లోడ్ రెట్టింపయ్యే అవకాశం ఉంది. దీనివల్ల త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది.
మందులు, చికిత్స విధానాలు...
పావిపిరావిర్ మాత్ర
అత్యవసర వాడకానికి మాత్రమే దీనికి అనుమతి ఉంది. పైగా ట్రయల్స్ జరుగుతున్నాయి. దీనికి మరణాలను ఆపగలిగే శక్తిలేదు.
ఎప్పుడు వాడాలి..
► జ్వరం, దగ్గు, ఆయాసం ఉన్నప్పుడు
► 18–75 ఏళ్ల మధ్య వారికి మాత్రమే వాడాలి
► ఈ మాత్ర వాడకంపై జాతీయ స్థాయిలో ఎలాంటి సిఫార్సులు లేవు. కానీ డాక్టర్ల సూచనల మేరకు 72 గంటల్లోగా ఇస్తే వైరల్ లోడ్ తగ్గిస్తుంది.
కరోనా దశలు...
మొదటి దశ: హోం క్వారంటైన్ లేదా ఐసోలేషన్ వార్డు..
► లక్షణాలు లేకుండా కరోనా బారినపడినవారు.
► కొద్దిగా జ్వరం, బలహీనంగా ఉండటం, కండరాల నొప్పి, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, తుమ్ములు, వాంతులు, వాంతులు వస్తున్నట్లుగా అనిపించడం, కడుపునొప్పి, విరేచనాలు
రెండో దశ: ఆసుపత్రిలో సాధారణ లేదా ఆక్సిజన్‌పై చికిత్స
► జ్వరం తగ్గకపోవడం, దగ్గు నిరంతరాయంగా ఉండటం, ఛాతీ ఎక్స్‌రే లేదా సీటీ స్కాన్‌లో ఏదో సమస్యను గుర్తించడం.
మూడో దశ: ఐసీయూ..
► తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్య. రక్తంలో ఆక్సిజన్ శాతం 92 కంటే తక్కువగా ఉండటం.
► అత్యవసర క్రిటికల్ కేర్, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, లో బీపీ, గుండె వైఫల్యం, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, కిడ్నీ సమస్యలు తలెత్తడం.
ప్లాస్మాతో చికిత్స...
అత్యవసర వాడకానికి మాత్రమే అనుమతి ఉంది. ఇది కూడా ట్రయల్ దశలో ఉంది. ప్రత్యామ్నాయంగా మాత్రమే వాడాలి.
ఎప్పుడు చేయాలంటే?
► 18 ఏళ్లు పైబడిన వారికే.
► జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకునే స్థితి నిమిషానికి 35 ఉన్నప్పుడు లేదా రక్తంలో ఆక్సిజన్ శాతం 90 కంటే తక్కువ ఉన్నప్పుడు.
► ప్లాస్మా చికిత్స వల్ల కరోనా నుంచి కోలుకునే అవకాశం ఉంది. దీన్ని వాడాలా వద్దా డాక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
నివారణే అసలైన మార్గం..
► కోవిడ్‌కు సంబంధించిన చికిత్స విధానాలన్నీ ట్రయల్స్‌కు సంబంధించినవే.
► కోవిడ్‌కు ఎలాంటి మందు లేదు. కాబట్టి నివారణ ఒక్కటే మార్గం.
► మాస్క్‌లు ధరించాలి. చేతులు శుభ్రపరుచుకోవాలి. భౌతిక దూరం పాటించాలి.
► కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు నిర్ణీత సమయంలో తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment