ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నిజామాబాద్ అర్బన్: కరోనా కేసులు తగ్గుతున్నతరుణంలో మహారాష్ట్ర నుంచి వచ్చే వారి నుంచి పాజిటివ్ ముప్పు పొంచి ఉంది. సెకెండ్‌వేవ్‌లో రెండు నెలల క్రితం విపరీతంగా రాకపోకలు ఉండడంతో కేసుల పెరుగుదల ఎక్కువైంది. ప్రస్తుతం జిల్లాలో కరోనా కేసులు తగ్గుతున్న తరుణంలో మహారాష్ట్ర నుంచి వస్తున్న వారితో ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటన నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో ఇటీవల చోటు చేసుకుంది. చిన్నపాటి విందుకు వచ్చిన మహారాష్ట్ర వాసుల కారణంగా గ్రామంలో కరోనా కేసులు పెరగగా, అధికారులు నివారణ చర్యలు చేపట్టి వైరస్‌ను నియంత్రణలోకి తీసుకొచ్చారు.
కందూరు.. కొంపముంచింది..
నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో ఓ కుటుంబం సంప్రదాయం ప్రకారం గతనెల 30వతేదీన కందూరు చేశారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని తమ బంధువులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించగా అక్కడి నుంచి ఆరుగురు బంధువులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయిన రెండు రోజులకే కందురు చేసిన కుటుంబంలో మొదట ఐదుగురికి కరోనా లక్షణాలు బయటపడడంతో టెస్టులు చేయించుకున్నారు. పాజిటివ్ వచ్చింది.
గ్రామంలోని కొందరు ఈ కార్యక్రమానికి వెళ్లగా వారికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కందూరు చేసిన ఇంటి చుట్టు పక్కల ఉన్న వారికి, గ్రామంలోని కొందరికీ వేగంగా వైరస్ విస్తరించింది. గ్రామంలో ఒక్కొక్కరికి లక్షణాలు వెలుగులోకి రావడంతో వెంటనే అప్రమత్తమైన వైద్యసిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
దీంతో అదనపు వైద్యాధికారి రమేష్ గ్రామాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. వైరస్ వ్యాప్తి జరిగినట్లు గుర్తించి గ్రామంలోనే కరోనా టెస్టులు చేపట్టారు. ఈనెల 2న 5కేసులు, 3న 15కేసులు, 4న 12కేసులు, 5–11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 43 కేసులు వెలుగులోకి వచ్చాయి.
స్పందించిన వైద్యాధికారులు..
త్వరితగతిన స్పందించిన వైద్యాధికారులు పాజిటివ్ వచ్చిన వ్యక్తులను హోంఐసోలేషన్ లో ఉంచారు.ఎప్పటికప్పుడు గమనిస్తూ మందులను అందించారు. దీంతో ఒక్కొక్కరికి పాజిటివ్ తగ్గుతూ వస్తోంది. కాగా కందూరుకి వచ్చిన మహారాష్ట్ర వాసులు వెంటనే వెళ్లిపోయారు. వైద్యాధికారులు, ఎంపీడీవో, ఏసీపీ, ఇతర అధికారులు ఎప్పటికప్పుడుగ్రామాన్ని సందర్శిస్తూ వివరాలు తెలుసుకున్నారు.
జిల్లా వైద్యాధికారి డా.బాలనరేంద్ర గ్రామాన్ని సందర్శించి కోవిడ్ నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించి గ్రామస్తులతో చర్చించారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కాగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తుల నుంచి పాజిటివ్ రావడంతో వైద్యాధికారులు వైరస్‌సరళిని పరిశీలిస్తున్నారు. సెకండ్‌వేవ్ లక్షణాలుఉన్నాయా లేక థర్డ్ వేవ్ లక్షణాలు ఏమైనాఉన్నాయా అని పరిశీలన చేపట్టగా సెకండ్ వేవ్ లక్షణాలుఉన్నట్లు గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.
పక్క రాష్ట్రవాసులతోనే సమస్య..
జిల్లాలో ఒకవైపు పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతున్న తరుణంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో మహారాష్ట్ర వాసులు ఇక్కడికి రావడం పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం వైద్యశాఖను ఆందోళనకు గురిచేసింది.ప్రస్తుతం గ్రామంలో కొత్తగా పాజిటివ్ కేసులు రావడం లేదు. తాజాగా ఆదివారం 39మందికి టెస్టులు చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది.
గ్రామంలో అందరికీ టెస్టులు చేసేందుకు వైద్యాధికారులు ప్రతిరోజు అక్కడ శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డా.బాలనరేంద్రను వివరణ కోరగామహారాష్ట్ర వాసులు ఇక్కడికి రావడంతో పాజిటివ్ కేసులు పెరిగాయని, గ్రామంలో కొందరికి వైరస్ సోకిందన్నారు. హుటాహుటిన స్పందించిన యంత్రాంగం వైరస్‌ను నియంత్రణలోకి తీసుకురావడం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment