9, 10, ఇంటర్‌ విద్యార్థులకు కేంద్రం మార్గదర్శకాలు | Coronavirus: Health Ministry Issues SOP For Partial Reopening Of Schools | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు అనుమతిస్తేనే..!

Published Fri, Sep 11 2020 3:38 AM | Last Updated on Fri, Sep 11 2020 9:01 AM

Coronavirus: Health Ministry Issues SOP For Partial Reopening Of Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకోవాలంటే వారి తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల అనుమతి మేరకే విద్యార్థులను పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతించాలని, కట్టడి ప్రాంతాల్లో (కంటైన్మెంట్‌ జోన్లలో) పాఠ శాలలు, జూనియర్‌ కాలేజీలు తెరవకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్‌ కాని ప్రాంతాల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలను స్వచ్ఛందంగా పాక్షికంగా తెరుచు కోవచ్చని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేలా పాక్షికంగా ఆయా తరగతులకు సంబంధించిన స్కూళ్లు, కాలేజీలు ఈ నెల 21 నుంచి ప్రారంభించడానికి అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే పూర్తిస్థాయిలో ఆయా తరగతులకు చెందిన పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు తెరవాల్సి వస్తే దానికి ఎలా సన్నద్ధం కావాలన్న దానిపైనా కేంద్రం ప్రణాళిక రచించింది. అంటే పాక్షికంగా తెరవడం, పూర్తిగా తెరవడానికి అవసరమైన రెండు ప్రణాళికలను ప్రకటించింది. 

పాక్షికంగా తెరవాల్సి వస్తే...

  •  ఆన్‌లైన్‌ లేదా దూర విద్యను ప్రోత్సహించాలి. 
  • 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుంచి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికే స్వచ్ఛంద ప్రాతిపదికన అనుమతిస్తారు. 
  • కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌లు తప్పనిసరి. 40 నుంచి 60 సెకన్లు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
  • ఆల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్లను వాడాలి. 
  • తుమ్ము, దగ్గు వస్తే మోచేయిని అడ్డుగా పెట్టుకోవాలి. 
  • ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్‌ స్టాల్‌ చేసుకోవాలి. 


ప్రారంభించడానికి ముందు...

  • నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలోని పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలను మాత్రమే తెరవడానికి అనుమతిస్తారు. 
  • ప్రయోగశాలలు, తరగతి గదులు సహా ఇతర అన్ని ప్రాంతాలను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. 
  • బోధన, బోధనేతర సిబ్బందిని 50 శాతం వరకే రప్పించాలి. ఆన్‌లైన్‌ బోధన, టెలీ కాన్ఫరెన్స్‌ కోసమే వారు రావాల్సి ఉంటుంది.
  • బయోమెట్రిక్‌ హాజరుకు బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. 
  • సబ్బుతో పాటు చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు ఉండాలి. 
  • అవకాశముంటే బహిరంగ ప్రదేశాల్లో తరగతులు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. 
  •  ప్రార్థనలు, క్రీడలు ఇతరత్రా గుమిగూడే కార్యకలాపాలు నిషేధం. 
  •  అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి రాష్ట్ర హెల్ప్‌లైన్‌ నంబర్లు, స్థానిక ఆరోగ్య అధికారుల నంబర్లను కనబడేలా ప్రదర్శించాలి.
  • అధిక వయస్సున్నవారు, గర్భిణి ఉద్యోగులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు విద్యార్థులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండొద్దు. 
  •  థర్మల్‌ గన్స్, ఆల్కహాల్‌ వైప్స్‌ లేదా సోడియం హైపోక్లోరైట్‌ సొల్యూషన్స్, సబ్బు వంటివి తగినంతగా ఉండాలి. 
  • ఆక్సిజన్‌ స్థాయిలను లెక్కించడానికి పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పనిసరిగా ఉంచాలి. 


తెరిచిన తరువాత...

  •  ప్రవేశద్వారం వద్ద తప్పనిసరిగా శానిటైజర్‌ ఉంచాలి. థర్మల్‌ స్క్రీనింగ్‌ చేపట్టాలి. 
  • ఎలాంటి కరోనా లక్షణం లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించాలి. ఎవరికైనా లక్షణాలుంటే సమీప ఆరోగ్య కేంద్రానికి పంపించాలి. సదరు వ్యక్తికి పాజిటివ్‌ ఉంటే వెంటనే ప్రాంగణాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. 
  •  పార్కింగ్‌ స్థలాలలో, కారిడార్లలో, ఎలివేటర్లలో గుంపులు లేకుండా చూడాలి.
  •  సందర్శకుల ప్రవేశాన్ని పరిమితం చేయాలి. 
  •  కుర్చీలు, డెస్క్‌ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాటు ఉండాలి. 
  •  నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, వాటర్‌ బాటిల్‌ వంటి వాటిని విద్యార్థులు పంచుకోకుండా చూడాలి. 
  •  ప్రయోగశాలల్లో పరికరాలను ఉపయోగించడానికి ముందు, తరువాత తరచుగా శుభ్రం చేయాలి. 
  •  క్యాంటీన్లు, మెస్‌లుంటే వాటిని మూసివేయాలి. 
  •  రవాణా సౌకర్యం ఉంటే బస్సులు లేదా ఇతరత్రా వాహనాలను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి.
  •  తరచుగా తాకే తలుపులు, ఎలివేటర్‌ బటన్లు, కుర్చీలు, బెంచీలు తదితరమైన వాటిని శుభ్రపరచాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement