వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పాఠశాలలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: కరోనాతో పాఠశాలలు సుదీర్ఘ కాలం మూతపడటం విద్యార్థుల మానసిక పరిస్థితిపై పెను ప్రభావం చూపిస్తోంది. ప్రత్యక్ష బోధన లేక ఇంటికే పరిమితం కావడం, ఆన్‌లైన్ క్లాసులు అర్థం కాకపోవడం సమస్యగా మారుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. దీంతో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విద్యా సంస్థల పునఃప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది. దీనిపై తల్లిదండ్రులతో పాటు విద్యారంగ నిపుణుల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. అయితే పెద్ద తరగతుల విషయంలో ఇబ్బంది ఉండబోదని, మిగతా వారి విషయంలో ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్ల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూస్తూ, ఆ మేరకు తగిన ఏర్పాట్లతో బడులు నడపడం అన్నివిధాలా శ్రేయస్కరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల కొరత వంటి ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టిసారించాలని సూచిస్తున్నారు.
ఈ సమస్యలు అధిగమిస్తే చాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 42,575 పాఠశాలల్లో 30 వేల పైచిలుకు ప్రభుత్వ స్కూళ్ళే ఉన్నాయి. దాదాపు 29 లక్షల మంది ఈ పాఠశాలల్లో చదువుతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బడులు ప్రారంభం కానుండగా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం నుంచీ బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. ప్రధానంగా పాఠశాలల్లో కోవిడ్ నిబంధనల అమలుపైనే వారు దృష్టి పెడుతున్నారు. సామాజిక దూరం సహా ఇతర జాగ్రత్తలు పాటిస్తూ క్లాసుల నిర్వహణపై కసరత్తు కొనసాగిస్తున్నారు.
భౌతికదూరమెలా..?
సాధారణంగా ఒక్కో తరగతి గదిలో 60కి తక్కువ కాకుండా విద్యార్థులుంటారు. కోవిడ్ రూల్స్ ప్రకారం విద్యార్థుల మధ్య మూడు అడుగుల దూరం ఉండాలి. అందువల్ల ఒక గదిలో 30 మందికి మాత్రమే వీలవుతుందనుకుంటే మిగతా విద్యార్థులను ఏం చేయాలి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోజు విడిచి రోజు బ్యాచ్‌లుగా క్లాసులు పెట్టాలా? సెక్షన్లుగా విభజించాలా? అనే విషయంలో విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. శానిటైజేషన్ ప్రక్రియకు అవసరమయ్యే అదనపు ఖర్చు విషయంలోనూ స్పష్టత కొరవడింది.
సెక్షన్లుగా విభజిస్తే నిర్వహణెలా?
సెక్షన్లుగా విడగొడితే ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉండే విద్యా సంస్థల్లో నిర్వహణ కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటాన్ని ఉపాధ్యాయ సంఘాలు ప్రస్తావిస్తున్నాయి. రాష్ట్రంలో 7 వేల సబ్జెక్టు టీచర్లు, 2 వేల ప్రధానోపాధ్యాయులు, 10 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. భారీ సంఖ్యలో ఖాళీలను దృష్టిలో ఉంచుకునే ప్రతి ఏటా విద్యా వాలంటీర్ల సేవలు తీసుకుంటున్నారు. రూ.12 వేల నెలసరి వేతనంతో వారు పదో తరగతి వరకూ బోధిస్తున్నారు. తొలుత 17 వేల వరకూ ఉన్న విద్యా వాలంటీర్ల సంఖ్య... 2017 నుంచి 12 వేలకు తగ్గిపోయింది. అయితే స్కూళ్ళు పునఃప్రారంభ తేదీ ప్రకటించిన ప్రభుత్వం విద్యా వాలంటీర్ల సేవలను పొడిగిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనలు పాటించేందుకు సెక్షన్లుగా విభజించాల్సి వస్తే విద్యా వాలంటీర్ల సేవలు తప్పనిసరి అవుతుంది. అందువల్ల ఈ అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
బడులు తెరిచాక తాజా మార్గదర్శకాలు
కోవిడ్ నిబంధనలపై విద్యార్థుల్లో పూర్తి అవగాహన కల్పించి, కాస్త కఠినంగా వ్యవహరించడం ద్వారానైనా వారిని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బడులు ప్రారంభమయ్యాక, వారం రోజులు పరిశీలించిన తర్వాత మరోసారి మార్గదర్శకాలు జారీ చేసే వీలుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విద్యార్థుల హాజరుపై అప్పటికి ఒక స్పష్టత వస్తుందని చెప్పారు. వైద్య సదుపాయాల కల్పనపై కూడా ఒక అంచనాకు రావచ్చని అన్నారు.
తొలుత అవగాహన .. తర్వాత బోధన
విద్యా సంస్థల నిర్వహణలో కోవిడ్ నిబంధనల పాటింపే ముఖ్యం. పాఠశాలల శానిటైజేషన్‌కు, విద్యార్థులకు మాస్కులు అందించేందుకు అవసరమైన నిధులు సమకూర్చాలి. విద్యార్థులకు కోవిడ్ నిబంధనలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాక బోధనపై దృష్టి పెడితే బాగుంటుంది.
– జంగయ్య, యూటీఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment