
సాక్షి, ఖమ్మం: మహమ్మారి సోకి చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు సేవాభావంతో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో అంతిమ సంస్కారం జరిపిస్తున్నారు ఖమ్మంలోని అన్నం సేవా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ అన్నం శ్రీనివాసరావు. దైవ కార్యంగా భావిస్తూ కోవిడ్ తొలి, రెండో దశల్లో ఇప్పటివరకు 700 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా విలయ తాండవం చేస్తున్న సమయంలో..ఈ మహమ్మారికి భయపడి కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు వచ్చేందుకు వెనకడుగు వేసిన వేళ..అన్నం తన బృందంతో కలిసి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. మొదటి వేవ్‌లో ఉభయ జిల్లాల్లో 500మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు.
వైరస్ ఉధృతి ఆందోళనలో ఉన్న ప్రజలు తమ గ్రామాలకు మృత దేహాలను తీసుకురానీయకుండా రోడ్లపై కంపలేసి అడ్డుకుంటే..ఖమ్మం ప్రకాష్‌నగర్, కాల్వొడ్డుకు చేర్చి అంతిమ సంస్కారం జరిపించారు. కాటికాపర్లు నిరాకరించిన సమయంలో కూడా ఒక్కరోజులో 13మృతదేహాలకు అంత్యక్రియలు చేసిన సందర్భాలున్నాయి. కరోనా రెండో దశలో పొరుగున ఉన్న మహబూబాబాద్, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 200 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి ప్రజల్లో కొంత అవగాహన పెరగడంతో ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఇతరుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రతిరోజూ అన్నం సేవా ఫౌండేషన్‌కు కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియల కోసం 10కి పైగా ఫోన్ కాల్స్ వస్తుండడం విశేషం.
అన్నం శ్రీనివాసరావుకు భార్య విజయలక్ష్మి, కుమారుడు అమరేశ్వరరావు, కూతురు హేమలతల సహకారం మరువలేనిది. 16 ఏళ్ల వయసున్న తన మనవరాలు శ్రీదేవి కూడా తాతను అనుసరిస్తూ అంత్యక్రియల్లో పొల్గొంటోంది. తన బృందంలోని పదిహేను మందిలో ఐదుగురు మహిళలు, పది మంది పురుషులున్నారు. తొలి నాళ్లలో అంత్యక్రియలకు రావడానికి భయపడిన వీరు అన్నంను చూసి ఇప్పుడు ఎక్కడ అంత్యక్రియలు ఉంటే అక్కడికి ఆయనను అనుసరిస్తుండడం విశేషం.
ఆలింగనం చేసుకుని ధైర్యం..
చనిపోయాక కొన్ని గంటల తర్వాత మృతదేహం ద్వారా వైరస్ వ్యాపించదని అన్నం శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. ఖమ్మంలో..కృష్ణాజిల్లా మైలవరం మండలానికి చెందిన వ్యక్తి మరణించగా..మృతదేహాన్ని ఆలింగనం చేసుకుని కుటుంబ సభ్యులను భయపడొద్దని ధైర్యం చెప్పారు. అలాగే నేలకొండపల్లి ముజ్జుగూడెం గ్రామంలో, తల్లాడ మండలం మల్లారం..ఇంకా అనేక చోట్ల చాలా మృత దేహాలను హత్తుకొని.. కరోనా రాదని ప్రచారం చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment