సాక్షి, హైదరాబాద్ : కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ప్రమాణం చేశాకే మేయర్, డిప్యూటీ మేయర్లుగా పోటీ చేయడానికి కానీ, వారిని ఎన్నుకునేందుకు ఓటు వేసేందుకు కానీ అవకాశం ఉంటుంది. ఈ నెల 11వ తేదీన ఒంటిగంట కల్లా అందరూ జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యాక, ఎన్నిక కార్యక్రమం ప్రారంభమయ్యాక ప్రమాణ స్వీకారానికి అవకాశం ఉండదు.
మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల విధివిధానాలు, అనుసరించాల్సిన పద్ధతులు తదితరమైన వాటి గురించి ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి తమ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శ్వేతామహంతి, అడిషనల్ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్‌కుమార్, జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు..
- కొత్త కార్పొరేటర్లు 11వ తేదీ ఉ. 11 గంటలకు హాజరై ప్రమాణ స్వీకారం చేయాలి.
- ప్రమాణం చేస్తేనే 12.30 గంటలకు మేయర్ ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు అనుమతి.
- కార్పొరేటర్‌తోపాటు ఎక్స్‌అఫీషియో సభ్యులకూ ఒక్కొక్కరు ఒక్క ఓటు మాత్రమే వేయాలి.
- చేతులెత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుంది.
- ఓటింగ్ నిర్వహించేందుకు కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణించి ఎన్నిక నిర్వహిస్తారు. కోరం లేకపోతే గంటపాటు నిరీక్షిస్తారు.
- మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూడా కోరం లేకున్నా, ఏదైనా అనివార్యకారణాల వల్ల ఎన్నిక జరగకపోయినా,ప్రిసైడింగ్ అధికారి మర్నాటికి వాయిదా వేస్తారు. విప్ వర్తిస్తుంది..
- గుర్తింపుపొందిన రాజకీయపార్టీలు విప్ కోసం నిర్దేశించిన అనుబంధం–1లో తమ పార్టీ తరపున విప్‌ను నియమించే అధికారాన్ని ఏ వ్యక్తికైనా ఇవ్వవచ్చు. లేదా పార్టీ అధ్యక్షుడు అనుబంధం–2 ద్వారా నేరుగా పార్టీ తరపున విప్‌ను నియమించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment