ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: మహమ్మారి కరోనా మనుషుల ప్రాణాలు బలిగొనడంతో పాటు మానవత్వాన్ని కూడా మంటగలుపుతోంది. సాటి మనిషి చనిపోతే అయ్యో పాపం అంటూ అంతిమ సంస్కారాల్లో పాల్గొనే స్థితి నుంచి డబ్బు ఇస్తేనే అంత్యక్రియలు చేస్తాం అనే స్థాయికి మానవ సంబంధాలను దిగజార్చింది. కోవిడ్-19 మృతదేహాలను తీసుకువెళ్లడానికి సొంత వారే రాకపోవడంతో అనాథ శవాలుగా మిగిలిన ఘటనలెన్నో చూశాం.
ఇక సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో బాధిత కుటుంబాల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసి, అంత్యక్రియలు చేసే దందాకు తెరతీశారు కొంతమంది. నిజానికి.. నిబంధనల ప్రకారం ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్‌తో మరణించిన వ్యక్తికి ఉచితంగా అంత్యక్రియలు చేయాలి. అదే, ప్రైవేటు హాస్పిటల్‌లో మరణిస్తే ఇందుకు 8 వేల వరకు ఖర్చు అవుతుంది. కానీ, కోవిడ్ కాలంలోనూ, సంపాదనే లక్ష్యంగా రూ. 25 నుంచి 70 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
70 వేలు అడిగారు
ఈ విషయం గురించి ఓ మహిళ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘మే మొదటి వారంలో కోవిడ్ బారిన పడిన నా భర్త గాంధీ ఆస్పత్రిలో మరణించాడు. ఆయననకు అంతిమ సంస్కారం నిర్వహించే వెసలుబాటు లేకపోవడంతో, ఓ మధ్యవర్తిని కలిశాం. ఇందుకు ఎన్నో అడ్డంకులు ఉంటాయని, కాబట్టి 40 వేల నుంచి 50 వేల వరకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పాడు.
అయితే, శవాన్ని ఎక్కడికి తీసుకువెళ్తారో చెప్పలేదు’’ అని గోడు వెళ్లబోసుకుంది. తండ్రిని కోల్పోయిన మరోవ్యక్తి.. ‘‘మా నాన్నకు కరోనా సోకింది. చెస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అంత్యక్రియల కోసం 70 వేలు ఇవ్వాలని ఓ మధ్యవర్తి మా దగ్గర డబ్బు డిమాండ్ చేశాడు’’ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు.
సాయంగా నిలుస్తున్న ఎన్జీఓలు
ఆపత్కాలంలో స్వచ్చంద సంస్థలు కరోనా బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. కోవిడ్‌తో మరణించిన వారికి అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నాయి. అయితే, చాలా వరకు కుటుంబాలకు సరైన సమాచారం లేక, వారిని చేరుకోలేకపోతున్నాయి. ఈ విషయం గురించి ఫీడ్ ది నీడీ ఎన్జీవోకు చెందిన సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. ‘‘శ్మశానాల వద్ద పరిస్థితి దారుణంగా ఉంది. కోవిడ్ మృతదేహాల అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ. 25 వేలు ఫిక్స్ చేసిందని కాటికాపరులు చెబుతున్నారు.
నిజానికి వీరి నంబర్లను ఆస్పత్రి సిబ్బందే బాధిత కుటుంబాలకు ఇస్తున్నారు. వీళ్లు ఇలా రేట్లు ఖరారు చేసి అందినకాడికి తీసుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు. ఇక తెలంగాణ వెల్ఫేర్ యూత్ ప్రెసిడెంట్ సయ్యద్ జలాలుద్దీన్ జాఫర్ మాట్లాడుతూ.. తమ బృందం ఇప్పటి వరకు 180 కోవిడ్ శవాలకు అంతిమ సంస్కారాలు చేసిందని చెప్పారు. చాలా మంది డబ్బులేక మృతదేహాలను ఆస్పత్రి బయటే విడిచిపెట్టి వెళ్లిపోతున్నారని వాపోయారు.
మాకైతే అలాంటి ఫిర్యాదులు రాలేదు: మమత
కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ వి.మమత ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘స్థానిక విద్యుత్ శ్మశాన వాటికల్లో ఉచితంగానే కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుంటున్నారని మాకు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment