
కరోనా తొలినాళ్ల తరహాలో ఇప్పుడు ‘ఒమిక్రాన్’ పరేషాన్ చేస్తోంది. ఈ వేరియంట్ వ్యాపించిన దేశాల నుంచి ప్రయాణికులు వస్తుం డటం, వారిలో కొందరికి పాజిటివ్‌గా తేలుతుండటం, ఇదే సమయంలో రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది. విదేశాల నుంచి వచ్చిన కోవిడ్ బాధితుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపినా.. ‘ఒమిక్రాన్’ ఉన్నదీ లేనిదీ తేలడానికి నాలుగైదు రోజులు పట్టనుండటం ఉత్కంఠ రేపుతోంది.
సాక్షి, హైదరాబాద్: విమానాశ్రయాల్లో కట్టుదిట్టంగా స్క్రీనింగ్ చేపట్టిన ఈనెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకు.. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి 909 మంది రాగా 13 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఒక్క శుక్రవారం రోజునే 219 మంది ఒమిక్రాన్ వ్యాప్తి ఉన్న యూకే, యూరప్, సింగపూర్ దేశాల నుంచి వచ్చారు. వీరిలో 9 మందికి కరోనా నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన అందరినీ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారి నమూనా లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. ఫలితాలు రావడానికి 4,5 రోజులు పట్టనుంది. ఇక విదేశాల నుంచి వచ్చిన వారంతా తప్పనిసరిగా హోంఐసోలేషన్‌లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
వచ్చేప్పుడు నెగిటివ్.. ఇక్కడ పాజిటివ్!
ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విమానాశ్రయాలను కట్టుదిట్టం చేసింది. హైరిస్క్ దేశాల నుంచి వస్తున్న అందరికీ, ఇతర దేశాల నుంచి వస్తున్నవారిలో కొందరికి ర్యాండమ్‌గా టెస్టులు చేస్తున్నారు. వాస్తవానికి ఏ దేశం నుంచి ఇక్కడికి రావాలన్నా.. ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లాలన్నీ.. ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్ ఉండాలి. హైరిస్క్ దేశాల నుంచి వస్తున్నవారు కూడా తమవెంట నెగిటివ్ రిపోర్టు తెస్తున్నారు. అంటే వారికి కరోనా ఉండకూడదు. కానీ ఇక్కడ వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తే.. 13 మందికి పాజిటివ్ రావడం గమనార్హం.
ఇంత జరుగుతున్నా టీకాలపై నిర్లక్ష్యమే!
ఒమిక్రాన్ దేశంలోకి ప్రవేశించినా, దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నా.. టీకాలు వేసుకునే విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని వైద్యశాఖ సిబ్బంది అంటున్నారు. రాష్ట్రంలో 90శాతం వరకు మొదటి డోసు వేసుకున్నా.. రెండో డోసు 48 శాతమే అయింది. రెండో డోస్ వేసుకోకుండా పెండింగ్‌లో ఉన్నవారు 24.80 లక్షల మందికిపైగా ఉన్నారు. ఇందులో చాలా మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లూ ఉండటం ఆందోళనకరంగా మారింది.
కుమురంభీం జిల్లాలో కేవలం 16 శాతమే రెండో డోస్ తీసుకున్నారు. వికారాబాద్, గద్వాలల్లో 19 శాతం, నారాయణపేటలో 21 శాతం, ఆదిలాబాద్ 23 శాతం, వనపర్తి 26 శాతం, నాగర్ కర్నూల్ 27 శాతం, మహబూబ్‌నగర్ జిల్లాలో 29 శాతమే రెండో డోసు తీసుకున్నారు. రెండో డోస్ అధికంగా హైదరాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 73 శాతం మేర పూర్తయింది. ఈ నేపథ్యంలో తక్కువ వ్యాక్సినేషన్ జరిగిన జిల్లాలపై వైద్యారోగ్యశాఖ ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. శాఖ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం పలు జిల్లాల్లో పర్యటించి పరిశీలించింది. కిందిస్థాయి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చింది. వ్యాక్సినేషన్‌కు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని.. ఈ నెలాఖరు నాటికి 100% రెండు డోసుల టీకా పూర్తి చేయాలన్నారు.
ఇక దేశీయ ప్రయాణాలకూ ఆంక్షలు!
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలు ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణికులపై పలు ఆంక్షలు విధించాయి. ఇక దేశీయ ప్రయాణాలకూ ఆంక్షలు మొదలుకానున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సర్కారు ముంబై వచ్చే విమాన ప్రయాణికులు కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని, లేదా ప్రయాణానికి 48 గంటల ముందు చేసిన ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని ప్రకటించింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ప్రయాణికులకు ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్టు తెలిసింది.
యూకే నుంచి వచ్చి.. క్వారంటైన్ తప్పించుకోబోయి
యూకే నుంచి వచ్చిన ఓ 36 ఏళ్ల మహిళకు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. అధికారులు క్వారంటైన్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆమె వారి కళ్లుగప్పి బయటికి వెళ్లిపోయింది. చింతల్ ప్రాంతంలోని రిడ్జ్ టవర్స్‌కు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ అధికారులు వెంటనే దీనిపై జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. ఆమె పాస్‌పోర్ట్‌లోని చిరునామాను అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. సదరు మహిళను ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. స్థానిక సీఐ బాలరాజు సదరు మహిళకు నచ్చజెప్పి వైద్యాధికారుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఆమెకు లక్షణాలు పెద్దగా లేవని, ఆమె తల్లిదండ్రులను హోంఐసోలేషన్‌లో ఉంచామని వెల్లడించారు.
ఆస్పత్రుల్లో మళ్లీ వార్డులు సిద్ధం
విదేశాల నుంచి వచ్చిన వారికి కోవిడ్ పాజిటివ్ వస్తుండటం, రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. టిమ్స్‌తోపాటు గాంధీ కోవిడ్ కేంద్రాల్లో ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రత్యేక కోవిడ్ వార్డులను, ఐసీయూలు, ప్రత్యేక పడకలను సిద్ధం చేస్తోంది. ఆక్సిజన్ సరఫరా ఏర్పాట్లు, వెంటిలేటర్లు వంటివి ఎలా ఉన్నాయన్న దానిపై దృష్టిపెట్టింది. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఉంటే మరమ్మతులు చేయించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించింది. రోగులకు వెంటిలేటర్ల కొరత లేకుండా ముందస్తు ఏర్పాట్లపై దృష్టిపెట్టాలని సూచించింది. ఇక కోవిడ్ నిర్ధారణ కోసం ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని నిర్ణయించింది.
ఫారిన్ జర్నీ పరేషాన్
విదేశాల నుంచి వచ్చినవారిలో కరోనా పాజిటివ్ వచ్చినవారిని టిమ్స్‌కు తరలిస్తున్న వైద్యారోగ్య శాఖ.. మిగతా వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని స్పష్టంగా ఆదేశించింది. గంటల కొద్దీ సాగే విమాన ప్రయాణంలో పాజిటివ్ వచ్చినవారితో కలిసి మిగతా వందలాది మంది ప్రయాణిస్తున్నారు. అందులోనే భోజనం, టిఫిన్ చేస్తారు. బాత్రూమ్‌లు వినియోగిస్తారు. మాస్కులను కట్టుదిట్టం చేసినా.. పలుమార్లు వాటిని తీయాల్సి ఉంటుంది. పాజిటివ్ వారిలో ఎవరికైనా ఒమిక్రాన్ ఉండి ఉంటే.. మిగతా ప్రయాణికులకూ సోకినట్టేనన్న చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉండేవారిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని.. ఎనిమిది రోజుల తర్వాత మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలని, ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రులకు తరలించాలని వైద్యాధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన విదేశీ ప్రయాణికుల్లో చాలామంది తమకేమీ లేదన్న భావనతో బయట తిరుగుతున్నారన్న ఆరోపణలున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వందల మందిని పర్యవేక్షించడం అధికారులకు సవాల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment