సాక్షి, హైదరాబాద్: ఈ డిసెంబర్ నెలాఖరులోగా రాష్ట్రంలో వందకు వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ జరగాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ఇందుకోసం ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు దీక్షతో పని చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలని, మొదటి డోసు టీకా తీసుకున్నవారు ఎంతమంది? ఎంతమంది రెండో డోసు కూడా తీసుకున్నారు? వివరాలు సేకరించాలని చెప్పారు. అందరికీ వ్యాక్సిన్లు వేయాలని ఆదేశించారు. గురువారం వివిధ జిల్లాల వైద్యాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హెల్త్ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనుమానాలు నివృత్తి చేయండి
డాక్టర్లు, ఏఎన్‌ఎంలు, ఆశాలు.. గ్రామ, సబ్ సెంటర్, పీహెచ్‌సీ స్థాయిలో ప్రణాళికలు వేసుకుని ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకునేలా చూడాలని మంత్రి సూచించారు. ప్రజల్లో టీకాలపై ఉన్న అపోహలు, అనుమానాలు నివృత్తి చేయాలని, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. కాలేజీ క్యాంపస్‌లు, పాఠశాలలు, హాస్టళ్లు, మార్కెట్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి అక్కడ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల 55 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 3.60 కోట్ల డోసులు వేశామని తెలిపారు. తొలి కోటి డోసులు వేయడానికి 165 రోజులు పట్టగా, రెండో కోటి డోసులు వేయడానికి 78 రోజులు, 3వ కోటి డోసులు పూర్తి చేయడానికి 27 రోజులు మాత్రమే పట్టిందని చెప్పారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు పెరగాలి
ఆశా వర్కర్లు మాతా–శిశు సంరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని హరీశ్‌రావు చెప్పారు. రక్తహీనతపై అవగాహన కల్పించి, వారికి అవసరమైన పోషకాహారం అందేలా చర్యలు తీసుకోవా లని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస వాలు పెరిగేలా చూడాలని చెప్పారు. పిల్లలకు సాధారణ టీకాలు వంద శాతం జరిగేలా చూడాల న్నారు. బీపీ, షుగర్, క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ.. ఆయా వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలని మంత్రి చెప్పారు.
రాష్ట్ర ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి రాష్ట్రాన్ని ప్రజారోగ్య రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య డైరెక్టర్ శ్రీనివాసరావు, సీఎం ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment