
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు, కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్‌ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేగాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా క్లినిక్‌లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితమయ్యే వారిని వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, బుధవారం కొందరు ఆర్‌ఎంపీ సంఘాల నేతలు శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు.
ఆస్పత్రులపై కొనసాగుతున్న దాడులు...
రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రులపై దాడులు కొనసాగుతున్నాయి. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,058 ఆస్పత్రులను, పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించిన 103 ఆస్పత్రులను సీజ్ చేశారు. 633 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 75 ఆస్పత్రులకు జరిమానాలు విధించారు.
రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా..
అత్య«ధికంగా రంగారెడ్డి జిల్లాలో 325, కరీంనగర్ జిల్లాలో 293, హైదరాబాద్‌లో 202, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 144, వికారాబాద్‌లో 109 ఆస్పత్రుల్లో తనిఖీలు చేశారు. మెదక్, నల్లగొండ జిల్లాల్లో మాత్రం తనిఖీలు జరగలేదు. కాగా, చిన్న చిన్న లోపాలున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవద్దని, వారికి 15 రోజులపాటు సమయమిచ్చి తదనంతరం సరిదిద్దుకోకపోతే చర్యలు తీసుకోవాలని డాక్టర్ శ్రీనివాసరావు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment