ప్రమాదకరంగా తీగల వంతెన.. కీలక నిర్ణయం | Dangerous Photo Shoot At Durgam Cheruvu Bridge | Sakshi
Sakshi News home page

ప్రమాదకరంగా తీగల వంతెనపై ఫోటోలు

Published Fri, Oct 2 2020 10:23 AM | Last Updated on Fri, Oct 2 2020 8:19 PM

Dangerous Photo Shoot At Durgam Cheruvu Bridge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తీగల వంతెనకు సందర్శకుల తాకిడి పెరుగుతోంది. గతనెల 25న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది. లాక్‌డౌన్‌ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్‌ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వంతెనపై వాహనాలు వేగంగా వేళ్తున్నా ఏమాత్రం లెక్కచేయకుండా ఫోటోలకు ఎగబడుతున్నారు.

రోడ్డుపై వస్తున్న వాహనాలు ఏమాత్రం లెక్కచేయకుండా సెల్పీలు దిగుతున్నారు. మరీ ముఖ్యంగా వారంతంలో సందర్శకుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. రోడ్డుకు అడ్డంగా నిలబడి రాకపోకలకు ఆటంకం కలిగిస్తుండటంతో సెల్పీస్పాట్‌ ప్రమాదకరంగా మారింది. దీనిపై దృష్టిసారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు వాహనాలపై వంతెనపై నిలపకుండా నిషేదం విధించారు. ఫోటోల కోసం వంతెనపై  ఆగితే భారీగా చలనాలు విధిస్తున్నారు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో అధికారులు తలలుపట్టుకుంటున్నారు. ఈ క్రమంలో శని, ఆదివారాల్లో వాహనాలను అనుమతించకూడదని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. వీకెండ్స్‌లో అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నందున ట్రాఫిక్ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై గురువారం సీపీ సజ్జనార్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

కేబుల్ బ్రిడ్జిపైకి సందర్శకులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, ఇతర సమస్యలు రాకుండా ట్రాఫిక్‌ వారాంతాల్లో వాహనాలను అనుమతించకపోవడమే సరైందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి తిరిగి సోమవారం ఉదయం 6 గంటల వరకు దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపైకి వాహనాలను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఆ బ్రిడ్జిపైకి ఐటీసీ కోహినూర్‌తో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 వైపు నుంచి వాహనాలతో సందర్శకులు వస్తున్నందున ఇరువైపులా పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. దీంతో వారంతంలో పర్యటకుల ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీపీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement