
బాధితుడిని పరామర్శిస్తున్న మంత్రి ఎర్రబెల్లి
సాక్షి, వరంగల్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, దానిని ఇలాగే కొనసాగించేలా ఆస్పత్రుల నిర్వహణను సమర్థంగా చేపడతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇదే సమయంలో ఆస్పత్రుల ప్రతిష్ట మసకబారే విధంగా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
కిడ్నీ సంబంధిత వ్యాధితో వరంగల్ ఎంజీఎంలోని ఆర్‌ఐసీయూలో చికిత్స పొందుతున్న హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ను ఎలుకలు కొరికిన నేపథ్యంలో మంత్రి శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్‌రెడ్డితో కలసి ఆస్పత్రిని సందర్శించారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలోని వివిధ వార్డులను సందర్శించి.. అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోగి శ్రీనివాస్‌ను ఎలుకలు కొరకడం దురదృష్టకరమని, ఇది ముమ్మాటికీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమేనని అన్నారు. ‘సర్కారీ దవాఖానాల్లో సహజంగానే పేషెంట్ కేర్, ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటారు. రోగుల పట్ల నిర్లక్ష్యం కావాలని ఉండదు. అయినా ఇలాంటి ఘటన జరగడం విచారకరం.
అందుకే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెంటనే విచారణ చేసి బాధ్యులుగా భావిస్తున్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతోపాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. ఆర్‌ఐసీయూ ఇన్‌చార్జి డాక్టర్ నాగార్జునరెడ్డిపై కూడా విచారణ జరుగుతోంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయి’అని ఆయన తెలిపారు. ఎంజీఎంలో పేషెంట్ కేర్‌తోపాటు పారిశుద్ధ్య పనులను చూస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని, ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment