సోమవారం హైదరాబాద్ కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ వద్ద ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లు
సుల్తాన్ బజార్: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలు ఇవ్వాలని తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆశవర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంహెచ్‌ఎస్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాదిగా ఆశవర్కర్లు తరలివచ్చారు.
ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ తామంతా సుశిక్షితులమని, ఎప్పటి కప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజాసేవ చేస్తున్నామని చెప్పారు. రోగుల సర్వే చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్, అన్ని రకాల జబ్బులు గుర్తించి మందులను రోగులకు సరఫరా చేస్తున్నామన్నారు. కరోనా నియంత్రించడంలో ఆశావర్కర్లు కీలక పాత్ర పోషించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశావర్కర్లకు హెల్త్ గ్లోబల్ లీడర్స్ అవార్డును కూడా ప్రకటించిందని గుర్తు చేశారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు సబ్ సెంటర్స్, దవాఖానాల్లో పనిచేయాలని ప్రభుత్వం చెబుతోందని, అయినా తమకు కేవలం రూ.9.750 వేలు మాత్రమే పారితోషకమే ఇస్తోందన్నారు. ఒకవైపు పనిభారంతో, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
వేతనం రూ.18 వేలకు పెంచాలని, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆశావర్కర్లకు హెల్త్ కార్డులు, ప్రమాద బీమా రూ.5 లక్షలు ఇవ్వాలని, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం పోస్టుల్లో ఆశావర్కర్లకు పదోన్నతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.నీలాదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment