ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన వెంకటేశ్ కొద్ది రోజుల క్రితం ఓ ఏజెంట్ సహాయంతో ఢిల్లీకి చెందిన సెకెండ్ హ్యాండ్ ఇన్నోవా కారును కొనుగోలు చేశాడు. ఆరేళ్ల క్రితం షోరూమ్ నుంచి బయటకు వచ్చిన బండి కావడంతో అన్ని విధాలుగా బాగుందని భావించాడు. పైగా తక్కువ ధరకే లభించడంతో వెనుకడుగు వేయకుండా బండెక్కేశాడు. కానీ వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో తాను దారుణంగా నష్టపోయినట్లు గుర్తించాడు. సదరు వాహనానికి సంబంధించిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) నకిలీదని తేలింది. రూ.15 లక్షల వాహనం కేవలం రూ.10 లక్షలకే లభించిందని మొదట ఎగిరి గంతేశాడు.
చదవండి: ట్రాన్స్‌కో ఏఈ పాడుపని.. నీతోనే పెళ్లంటూ యువతికి మత్తు మందు ఇచ్చి..
కానీ ఏజెంట్ చేతిలో తాను మోసపోయినట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. ...ఒక్క వెంకటేశ్ మాత్రమే కాదు. ఇటీవల కాలంలో తక్కువ ధరలకు లభిస్తున్నాయనే ఆశతో ఢిల్లీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసే నగరవాసులు సరైన ఆధారాలు లభించక నష్టపోతున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నగరంలో లభించే సెకెండ్ హ్యాండ్ వాహనాల కంటే ఢిల్లీ నుంచి కొనుగోలు చేసే వాహనాలు కొంత మేరకు తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ సరైన డాక్యుమెంట్లు లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతి రోజు సుమారు 3000లకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతాయి. వాటిలో 600 నుంచి 800 వరకు ఇతర రాష్ట్రాలకు చెందిన సెకండ్ హ్యాండ్ వాహనాలు..ప్రత్యేకించి కార్లు ఎక్కువగా ఉంటాయి. చెన్నై, బెంగళూరు, ముంబయి తదితర నగరాల నుంచి కూడా సెకెండ్ హ్యాండ్ వాహనాలు నగరంలో నమోదవుతున్నాయి. కానీ 70 శాతం వరకు ఢిల్లీకి చెందిన కార్లే ఎక్కువగా ఉన్నట్లు అంచనా.
నగరంలో 15 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాల కాలపరిమితిని ప్రతి సంవత్సరం పొడిగించుకొనే అవకాశం ఉంది. కానీ ఢిల్లీలో నమోదైన వాహనాలు కేవలం 10 ఏళ్ల కాలపరిమితికే పరిమితం. దీంతో ఢిల్లీ వాసులు తమ వాహనాల కాలపరిమితి ఆరేడుళ్లు దాటితే వాటిని సెకండ్ హ్యాండ్ వాహనాలుగా విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇలా విక్రయించే వాటి ధరలు కూడా కొంత మేరకు తక్కువగా ఉండడంతో నగరంలో డిమాండ్ ఏర్పడింది. దీన్ని సొమ్ము చేసుకొనేందుకు ఏజెంట్లు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ వాహనాలపైన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వినియోగదారులకు కట్టబెడుతున్నారు.
‘వాహన్’లో నమోదు తప్పనిసరి...
‘సెకెండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుపైన జాగ్రత్తగా ఉండాలి. వినియోగదారులకు చూపించే వాటికి, విక్రయించే వాటికి ఒక్కోసారి సంబంధం ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ‘వాహన్’లో నమోదైన వాహనాలను మాత్రమే కొనుగోలు చేయాలి.’ అని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ సూచించారు. కొన్ని ముఠాలు వాహనాలను అపహరించి విక్రయిస్తాయి. ఈ క్రమంలో నకిలీ ఆధారాలను సృష్టిస్తారు.
ఈ నకిలీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ‘వాహన్’లో బండి వివరాలు పరిశీలించాలని ఆయన తెలిపారు. వాహనం ఆర్సీ (రిజి్రస్టేషన్), ఢిల్లీ రవాణా అధికారులు జారీ చేసిన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ), బీమా పత్రాలు, తదితర డాక్యుమెంట్లను సమగ్రంగా పరిశీలించి సంతృప్తి చెందిన తర్వాత కొనుగోలు చేయడం మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాలపైన వాటి వయస్సు, కొనుగోలు చేసిన సమయంలో ఉన్న ధర ఆధారంగా నగరంలో నమోదుకు జీవితకాల పన్ను చెల్లించవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment