సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఎత్తయిన గణేష్ విగ్రహం (63 అడుగులు) కూడా ఇదే. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తొలిసారిగా 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభించింది.
తొలి వేలం పాటలో రూ.450కి దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో ఆ తర్వాత ప్రసాదానికి మరింత డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌నకు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలం పాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది.
పోటాపోటీగా వేలం పాటలు..
♦ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలు పోటాపోటీగా కొనసాగాయి. వినాయకుడి చేతిలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రముఖ మండపాల్లో నిర్వహించిన వేలం పాటల్లో రూ.15 కోట్లకుపై గా ఉత్సవ కమిటీలకు సమకూరినట్లు తెలిసింది.
♦ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.5 కోట్లు, ఖైరతాబాద్‌లో రూ. 33.75 లక్షలు, సికింద్రాబాద్‌లో రూ.19 లక్షలు, శేరిలింగంపల్లిలో రూ.1.25 కోట్లు, అంబర్‌పేటలో రూ.25 లక్షలు, మల్కాజిగిరిలో రూ.48లక్షలు, కుత్బుల్లాపూర్‌లో రూ.2.13 కోట్లు, చార్మి నార్ ఏరి యాలో రూ.56.88 లక్షలు, ఉప్ప ల్‌లో 1.50 కోట్లు, సనత్‌నగర్‌లో రూ.12 లక్షలు, గోషామహల్‌లో రూ.45 లక్షలు, మలక్‌పేటలో రూ.20 లక్షలు, మేడ్చల్‌లో రూ.1.50 కోట్లు, ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.20 లక్షల వరకు వేలం పాటలు కొనసాగాయి.
♦ కాగా.. బడంగ్‌పేట వీరాంజ నేయ భక్త సమాజం గణనాథుడి లడ్డూ కూడా రూ.17 లక్షలు.. చేవెళ్ల రచ్చబడం గణేషుడి చేతిలోని లడ్డూ ప్రసాదం రూ.22.11 లక్షలు, ఆదిబట్లలోని చైతన్య యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డు రూ.12.50 లక్షలు, ఫరూక్‌నగర్ మండల పరిధిలోని మధురాపూర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని లడ్డు రూ.11.11 లక్షలు, కొంపల్లి అపర్ణ మెడల్స్‌లోని లడ్డూ ధర రూ.13 లక్షలు పలికింది.
♦వేలం పాటలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తినడం, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిణీ చేయడం, పంట పొలాల్లో చల్లడం ద్వారా మంచి జరుగుతుందనే నమ్మ కం ఉంది. అంతే కాదు స్థానికంగా గుర్తింపుతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా లభిస్తుండటంతో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
రూ.1.25 కోట్లు పలికి..
ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతటా విస్తరించింది. ఈ ఏడాది గ్రేటర్‌లో చిన్నా పెద్దా కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్‌మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డూ ప్రసాదం ఆ రికార్డును బద్దలు కొట్టింది. రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment