Ganesh festivals
-
గణేష్ ఉత్సవాలకు సకల ఏర్పాట్లు
అబిడ్స్: గణేష్ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిద్ధంబర్‌బజార్ బహెతీభవన్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భాగ్యనగరం పరిధిలో నిర్వహించే 45వ సామూహిక గణేష్ ఉత్సవాల కోసం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గ్రేటర్ నలుమూలలా 24 నియోజకవర్గాలకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం లక్షకు పైగా గణేష్ మండపాలను ప్రతిష్టిస్తామన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. 17వ తేదీన అనంత చతుర్ధశి రోజు గణేష్ నిమజ్జనం చేస్తామన్నారు. ఉత్సవ సమితి కార్యదర్శి రావినూతల శశిధర్ మాట్లాడుతూ దైవభక్తి, దేశభక్తి, దేశ సంస్కృతిని సంరక్షించే విధంగా గణేష్ ఉత్సవాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం తమ ఉత్సవ సమితితో సమన్వయ సమావేశం నిర్వహించి వేడుకలు విజయవంతంగా అయ్యేవిధంగా కృషి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు మెట్టు వైకుంఠం, ఉత్సవ సమితి నాయకులు కౌడి మహేందర్, రమే‹Ù, శ్రీరామ్‌వ్యాస్, ఆల భాస్కర్, రూప్‌రాజ్, సలహాదారులు కోరడి మాల్, మాధవీలత పాల్గొన్నారు. -
లంబో‘ధర’ లడ్డూ!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఆ తర్వాత బాలాపూర్ లడ్డూ వేలం పాట. 1954లో తొలిసారిగా ఒక్క అడుగుతో ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఎత్తయిన గణేష్ విగ్రహం (63 అడుగులు) కూడా ఇదే. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తొలిసారిగా 1994లో లడ్డూ వేలం పాట ప్రారంభించింది. తొలి వేలం పాటలో రూ.450కి దక్కించుకున్నారు. ఈ లడ్డూను దక్కించున్న వారికి మంచి జరిగిందనే ప్రచారంతో ఆ తర్వాత ప్రసాదానికి మరింత డిమాండ్ పెరిగింది. 2002 నుంచి లక్షల్లో ధర పలకడం మొదలైంది. ఒకప్పుడు కేవలం బాలాపూర్‌నకు మాత్రమే పరిమితమైన ఈ లడ్డూ వేలం పాట ప్రస్తుతం ఇంతింతై అన్నట్లు గ్రేటర్ అంతా విస్తరించింది. పోటాపోటీగా వేలం పాటలు.. ♦ నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలు పోటాపోటీగా కొనసాగాయి. వినాయకుడి చేతిలో తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న ఈ లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం గ్రేటర్ జిల్లాల పరిధిలోని ప్రముఖ మండపాల్లో నిర్వహించిన వేలం పాటల్లో రూ.15 కోట్లకుపై గా ఉత్సవ కమిటీలకు సమకూరినట్లు తెలిసింది. ♦ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.5 కోట్లు, ఖైరతాబాద్‌లో రూ. 33.75 లక్షలు, సికింద్రాబాద్‌లో రూ.19 లక్షలు, శేరిలింగంపల్లిలో రూ.1.25 కోట్లు, అంబర్‌పేటలో రూ.25 లక్షలు, మల్కాజిగిరిలో రూ.48లక్షలు, కుత్బుల్లాపూర్‌లో రూ.2.13 కోట్లు, చార్మి నార్ ఏరి యాలో రూ.56.88 లక్షలు, ఉప్ప ల్లో 1.50 కోట్లు, సనత్‌నగర్‌లో రూ.12 లక్షలు, గోషామహల్లో రూ.45 లక్షలు, మలక్‌పేటలో రూ.20 లక్షలు, మేడ్చల్‌లో రూ.1.50 కోట్లు, ముషీరాబాద్ నియోజకవర్గంలో రూ.20 లక్షల వరకు వేలం పాటలు కొనసాగాయి. ♦ కాగా.. బడంగ్‌పేట వీరాంజ నేయ భక్త సమాజం గణనాథుడి లడ్డూ కూడా రూ.17 లక్షలు.. చేవెళ్ల రచ్చబడం గణేషుడి చేతిలోని లడ్డూ ప్రసాదం రూ.22.11 లక్షలు, ఆదిబట్లలోని చైతన్య యూత్ అసోసియేషన్ వినాయకుడి లడ్డు రూ.12.50 లక్షలు, ఫరూక్నగర్ మండల పరిధిలోని మధురాపూర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాథుని లడ్డు రూ.11.11 లక్షలు, కొంపల్లి అపర్ణ మెడల్స్లోని లడ్డూ ధర రూ.13 లక్షలు పలికింది. ♦వేలం పాటలో దక్కించుకున్న లడ్డూ ప్రసాదాన్ని తినడం, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపిణీ చేయడం, పంట పొలాల్లో చల్లడం ద్వారా మంచి జరుగుతుందనే నమ్మ కం ఉంది. అంతే కాదు స్థానికంగా గుర్తింపుతో పాటు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కూడా లభిస్తుండటంతో లడ్డూను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. రూ.1.25 కోట్లు పలికి.. ఖైరతాబాద్ గణేషుడితో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన సంస్కృతి.. క్రమంగా నగరమంతటా విస్తరించింది. ఈ ఏడాది గ్రేటర్లో చిన్నా పెద్దా కలిపి మొత్తం రెండు లక్షలకుపైగా విగ్రహాలు నెలకొల్పినట్లు అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు బాలాపూర్ లడ్డూకు మాత్రమే రికార్డు స్థాయిలో ధర పలికేది. తాజాగా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సన్‌సిటీ రిచ్మండ్ విల్లాలోని గణనాథుడి లడ్డూ ప్రసాదం ఆ రికార్డును బద్దలు కొట్టింది. రూ.1.25 కోట్లు పలికి భక్తులందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. -
ట్రాఫిక్ పోలీసుల రూట్ స్టడీ!
హైదరాబాద్: ‘గణేష్ విగ్రహాలతో ఊరేగింపుగా వచ్చే ఒక్క లారీకీ ఆటంకాలు ఏర్పడకూడదు. ఎక్కడా ట్రాఫిక్ జామ్స్‌కు తావుండకూడదు. 29వ తేదీ తెల్లవారుజాము సమయానికే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి రావాలి’ – గణేష్ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం నేపథ్యంలో నగర ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలివి. ఈ నెల 28న జరిగే ఈ క్రతువు కోసం అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ఠాణాల వారీగా నిమజ్జనం రూట్లను అధ్యయనం చేస్తూ, మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ చీఫ్ జి.సుధీర్‌బాబు నేతృత్వంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, డి.శ్రీనివాస్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. విగ్రహాల ఎత్తు ఆధారంగా మార్గం... సామూహిక నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేయడంలో ట్రాఫిక్ అధికారుల పాత్ర కీలకం. ఊరేగింపు మార్గంలో ఏ చిన్న అవాంతరం ఏర్పడినా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్స్ ఏర్పడటంతో పాటు ఆ ప్రభావం మరుసటి రోజు ట్రాఫిక్‌పై పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వివిధ మార్గాల్లో ఉన్న పాట్‌హోల్స్ మరమ్మతులు, చెట్టు కొమ్మల నరికివేత తదితర చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. మండపం ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత నిర్వాహకులు పోలీసులు ఇచ్చిన పత్రంలో విగ్రహం ఎత్తు, నిమజ్జనం జరిగే తేదీ, ప్రాంతం ఉంటున్నాయి. ఈ వివరాలు సేకరించిన ట్రాఫిక్ ఠాణాల వారీగా అధ్యయనం చేస్తున్నారు. సదరు విగ్రహం ఊరేగింపు జరిగే మార్గాల్లో ఉన్న వంతెనలు, వాటి ఎత్తు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రోడ్డు నుంచి వంతెన ఎంత ఎత్తులో ఉందో దాని కంటే కనిష్టంగా ఐదు అడుగుల తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలకే ఆయా రూట్లలో క్లియరెన్స్ ఇస్తున్నారు. ట్రాలీ లేదా లారీ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటూ ఇలా చేయనున్నారు. మిగిలిన వాటికి నిర్ణీత సమయం ముందే ప్రత్యామ్నాయ మార్గాలు సూచించనున్నారు. పీవీఎన్ఆర్ మార్గ్‌లో హోల్డింగ్ ఏరియా... నిమజ్జనానికి విగ్రహాలను తీసుకువచ్చే ప్రతి వాహనానికీ పోలీసు విభాగం సీరియల్ నెంబర్‌తో కూడిన స్టిక్కర్ ఇస్తుంటుంది. ఈసారి ఇందులో విగ్ర హం ఎత్తును పొందుపరుస్తున్నారు. ఆయా వాహనాలకు ముందు భాగంలో అతికించి ఉండే దీన్ని అంబేడ్కర్ విగ్రహం చౌరస్తాలోని పోలీసు సిబ్బంది పరిశీలిస్తారు. విగ్రహం ఎత్తు ఆధారంగా ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్‌లోని వాటిని పంపిస్తారు. నిమజ్జనం రోజున ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. ఈ నేపథ్యంలోనే వీలున్నంత వరకు 29వ తేదీ తెల్లవారేసరికి నిమజ్జనం పూర్తి చేసి, ఈ రెండు రూట్లను సాధారణ వాహనాలను అందుబాటులోకి తేవాలని ట్రాఫిక్ అధికారులు భావిస్తున్నారు. అప్పటికీ కొన్ని విగ్రహాల నిమజ్జనం మిగిలి ఉంటే పీవీఎన్ఆర్ మార్గ్‌ను హోల్డింగ్ ఏరియాగా చేసి వాటితో ఉన్న వాహనాలను అక్కడికి పంపిస్తారు. ఆపై ఆ మార్గంతో పాటు ఎన్టీఆర్ మార్గ్‌లో ఉన్న క్రేన్ల వద్ద క్రమపద్దతిలో నిమజ్జనం చేయడుతూ... రెండు మార్గాలను సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోపక్క పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో ఉన్న గణేష్ మండపాల వద్దకు స్వయంగా వెళ్తున్న నగర కొత్వాల్ సీవీ ఆనంద్ అక్కడి పరిస్థితులు, మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం రాత్రి హుస్సేనిఆలం, కామాటిపుర, మొఘల్‌పురాలో ఆనంద్ పర్యటించారు. తెలుగుతల్లి జంక్షన్ మూసివేతతో.. రాజధానిలో ఎన్ని నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్ ఉన్నప్పటికీ... హుస్సేన్‌సాగర్‌కు ప్రత్యేకత ఉంది. బషీర్‌బాగ్ వైపు నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులోని విగ్రహాలన్నీ అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా అటు ట్యాంక్‌బండ్, ఇటు ఎన్టీఆర్ మార్గ్‌వైపు వస్తాయి. అయితే కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలోని రహదారులు, జంక్షన్ల వద్ద కీలక మార్పు చేర్పులు జరిగాయి. తెలుగుతల్లి చౌరస్తా మూసివేతతో పాటు సచివాలయం ముందు కొత్త రోడ్డు అందుబాటులోకి రావడం, ఎన్టీఆర్ మార్గ్‌లో ఫుట్‌పాత్ నిర్మాణాల నేపథ్యంలో ఈ ఏడాది నిమజ్జనం ప్రక్రియలో స్వల్పమార్పు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. తెలుగుతల్లి జంక్షన్ మూసివేత నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా విగ్రహాలతో వచ్చే లారీలు ఇక్బాల్ మినార్ వైపు వెళ్లి... ఫ్లైఓవర్ ప్రారంభం వద్ద యూ టర్న్ తీసుకుని ట్యాంక్‌బండ్ వైపు రానున్నాయి. ఫార్ములా ఈ–రేసింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బారికేడ్లను ట్రాఫిక్ అధికారులు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పీవీఎన్ఆర్ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా పక్కన ఓ నిమజ్జనం ఘాట్ నిర్మించిన అధికారులు అక్కడ అదనంగా మూడు క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. డీసీఎం వాహనాల్లో వచ్చే మధ్య స్థాయి ఎత్తు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు. -
High Court: మండపాల వద్ద జనం గుమిగూడకుండా చూడాలి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కాగా, వినాయక చవితి ఉత్సవాల్లో జనం ఒకేచోట గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. అదే విధంగా.. వీలైనంత త్వరగా మండపాల వద్ద పాటించాల్సిన ఆంక్షలు, మార్గదర్శకాలను ప్రజలకు తెలియజేయాలని తెలిపింది. థర్డ్‌వేవ్ ప్రభావం నేపథ్యంలో... వైరస్‌ను ఎదుర్కొనేందుకు కచ్ఛితమైన ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను సెప్టెంబర్ 8కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. -
మెల్బోర్న్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు
-
మిషన్ గణేష్
- ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు - భారీ బందోబస్తు ఏర్పాట్లు - 17నవినాయక చవితి - 27న సాగర్‌లోనే నిమజ్జనం - డీజేలకు అనుమతి లేదు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణనాథుని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతి నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. దీనికోసం మైత్రీ సంఘాల సహకారం తీసుకోనున్నారు. గతంలో మాదిరిగా అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు సజావుగా సాగేలా చూడాలని నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 వేలు, సైబరాబాద్‌లో 15 వేల విగ్రహాలు ప్రతిష్టించే అవకాశం ఉంది. ప్రధాన ప్రాంతాలతో పాటు గల్లీల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్టించే మండపాల నిర్వాహకులు విద్యుత్ , నీటి సరఫరాకు అనుమతి తీసుకునేలా పోలీసులు చొరవ తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి జంట పోలీసు కమిషనరేట్లలో ఉన్న 1200 సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) నుంచి హోంగార్డు వరకు స్థానికంగా మండపాల నిర్వహణతో పాటు అక్కడి సమస్యలపై దృష్టి సారించేలా చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జంట కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. నాయక చవితి ఉత్సవాల్లో గతంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని... అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పాత నేరగాళ్ల కదలికపై డేగ కన్ను వేయడంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. నగరంలోకి వచ్చే సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొచ్చే గోవులు, పశువులను వెటర్నరీ డాక్టర్ల సమక్షంలో పరీక్షించనున్నారు. అంతా ఓకే అనుకున్నాకే అనుమతి ఇవ్వనున్నారు. సిబ్బంది కావాలని... వినాయక చవితి ఉత్సవాల కోసం భద్రతా పరంగా మరింత మంది సిబ్బంది కావాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లు హోంశాఖ మంత్రి నాయిని, డీజీపీ అనురాగ శర్మల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నగరంలో 12 వేలకు పైగా సిబ్బంది ఉన్నా... మరో పదివేల మంది అవసరమని చెప్పినట్టు సమాచారం. సైబరాబాద్‌కు ఏడు వేల మంది ఉన్నారని... మరో రెండు వేల మంది కావాలని కోరినట్టు సీపీ సీవీ ఆనంద్ కోరినట్టు తెలుస్తోంది. అప్రమత్తంగా ఉండండి వినాయక చవితి, బక్రీద్, అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలోనే వరుసగా వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సుమారు గంటకుపైగా సిబ్బందితో మాట్లాడారు. ఎక్కడా ఎటువంటి అపశ్రుతులకు తావులేకుండా ఉత్సవాలు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు: హోంమంత్రి నాయిని సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకుప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో హోం మంత్రి అధ్యక్షతన గణేషుని ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు సమన్వయంతో చేయాల్సిన పనులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాయిని విలేకరుల సమావేశంలో వివరించారు. 17న వినాయక చవితి, 24న బక్రీద్ పండుగకు, 27న గణేషుని నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. మండపాలకు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. అందరికీ క్రేన్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈసారి కూడా హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు. నగరంలోని అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సీఎం లేకుండా సమావేశమా? వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం నిర్వహించిన సమావేశం తూతూ మంత్రంగా సాగిందని గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు దుయ్యబట్టారు. సచివాలయంలో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సెక్యులర్ ఇమేజ్ కాపాడుకోవడం కోసమే సమావేశానికి రాకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశం ఎలాంటి నిర్ణయాధికారాలు లేకుండా ముగిసిందన్నారు. పోలీసులు అనేక ఆంక్షలు విధించినా వాటిపై నోరు మెదపడం లేదన్నారు. సీఎం విదేశీ పర్యటన ముగిసిన తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి, లోటుపాట్లపై చర్చించాలని కోరారు. గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. -
ధ్వని కాలుష్యాన్ని గుర్తించే ఎన్‌ఎంసీల ఏర్పాటు
సాక్షి, ముంబై: గణేష్ ఉత్సవాల సమయంలో ధ్వని కాలుష్యాన్ని గుర్తించేందుకు మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఎంపీసీబీ) రాష్ట్ర వ్యాప్తంగా 85 చోట్ల నాయిజ్ మానిటరింగ్ సెంటర్స్ (ఎన్ఎంసీ) ఏర్పాటు చేసింది. ఒక్క ముంబైలోనే 25 చోట్ల ఎన్ఎంసీలను ఏర్పాటు చేసింది. ముంబైతోపాటు పుణేలో 12, కొల్హాపూర్-4, సంబాజీనగర్-4 ఇలా కీలక నగరాల్లో కూడా ఏర్పాటు చేశారు. ముంబైలో గిర్గావ్ చౌపాటి, దాదర్, జుహూ చౌపాటి, ముంబెసైంట్రల్, పరేల్, చించ్‌పోక్లీ, బైకల్లా, బాంద్రా, ఖార్, శాంతాకృజ్, అంధేరి, కాందివలి, బోరివలి తదితర 25 ప్రాంతాల్లో ఎన్ఎంసీలను ఏర్పాటు చేశారు. కాలుష్యం అంచనా లౌడ్స్పీకర్లు, డీజే సౌండ్ సిస్టం, ఊరేగింపులో బ్యాండు, మేళతాళాలు, బాణసంచాలు కాల్చడం వల్ల ధ్వని కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ధ్వని కాలుష్యాన్ని కొలిచే పనులు ఏటా ఎంపీసీబీ చేపడుతుంది. ఏ ప్రాంతంలో ఎంత మేర ధ్వని కాలుష్యం పెరిగింది..? ఎక్కడ తగ్గింది..? అనేది దీని ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత ఒక నివేదిక రూపొందిస్తారు. గణేష్ ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు ఎంత మేర ధ్వని కాలుష్యం జరిగిందో గుర్తించారు. తర్వాత గురువారం జరిగే గౌరి, గణపతుల నిమజ్జం, చతుర్థి రోజున ఈ కాలుష్యాన్ని రీడింగ్ చేస్తారు. అనంతరం ప్రజలను జాగృతం చేసేందుకు ఎంపీసీబీ రూపొంధించిన నివేదికను ఆ బోర్డు వెబ్ సైట్లో ఉంచనున్నారు. ఎంపీసీబీ తయారు చేసిన ఈ నివేదిక వచ్చే ఏడాది ఉత్సవాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు పోలీసులకు దోహదపడుతోందని ఎంపీసీబీ ప్రజాసంబంధాల అధికారి సంజయ్ భుస్కుటే చెప్పారు. -
గణేష్ ఉత్సవాల్లో డీజే నిషేధం: ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: గణేష్ ఉత్సవాలలో డీజే సౌండ్‌ను నిషేధించామని, ఎవరైనా పోలీసుల కళ్లుగప్పి డీజేలను ఏర్పాటు చేస్తే ఉత్సవ కమిటీతో పాటు వాటిని అద్దెకిచ్చిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తగిన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం గచ్చిబౌలిలోని కమిషనరేట్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా నిర్వాహకులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజున కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత ఉత్సవ కమిటీలదేనని, వారు పోలీసులకు సహకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు భగవంతరావు మాట్లాడుతూ, పోలీసు అధికారుల సూచన మేరకు డీజేలను నిషేధిస్తామన్నారు. చెరువులలో పూడిక తీయాలని, విగ్రహాల తరలింపునకు తొందర పెట్టవద్దని, ఉచిత విద్యుత్‌ను ఇవ్వాలని, క్రేన్ నిర్వహణ లోపాలు జరగకుండా చూసేందుకు ఉన్నతాధికారిని నియమించాలని ఆయన కోరారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ వై.గంగాధర్, ఆయా జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలతో పాటు గణేష్ ఉత్సవ కమిటీసభ్యులు పాల్గొన్నారు.