ట్రాఫిక్‌ పోలీసుల రూట్‌ స్టడీ! | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ పోలీసుల రూట్‌ స్టడీ!

Published Sat, Sep 23 2023 6:22 AM | Last Updated on Sat, Sep 23 2023 8:21 AM

- - Sakshi

హైదరాబాద్: ‘గణేష్‌ విగ్రహాలతో ఊరేగింపుగా వచ్చే ఒక్క లారీకీ ఆటంకాలు ఏర్పడకూడదు. ఎక్కడా ట్రాఫిక్‌ జామ్స్‌కు తావుండకూడదు. 29వ తేదీ తెల్లవారుజాము సమయానికే ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌ సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి రావాలి’

– గణేష్‌ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సామూహిక నిమజ్జనం నేపథ్యంలో నగర ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలివి. ఈ నెల 28న జరిగే ఈ క్రతువు కోసం అధికారులతో పాటు క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బంది ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఠాణాల వారీగా నిమజ్జనం రూట్లను అధ్యయనం చేస్తూ, మండప నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్‌ చీఫ్‌ జి.సుధీర్‌బాబు నేతృత్వంలో డీసీపీలు రాహుల్‌ హెగ్డే, డి.శ్రీనివాస్‌ వీటిని పర్యవేక్షిస్తున్నారు.

విగ్రహాల ఎత్తు ఆధారంగా మార్గం...
సామూహిక నిమజ్జనాన్ని సజావుగా పూర్తి చేయడంలో ట్రాఫిక్‌ అధికారుల పాత్ర కీలకం. ఊరేగింపు మార్గంలో ఏ చిన్న అవాంతరం ఏర్పడినా గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్స్‌ ఏర్పడటంతో పాటు ఆ ప్రభావం మరుసటి రోజు ట్రాఫిక్‌పై పడుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి వివిధ మార్గాల్లో ఉన్న పాట్‌హోల్స్‌ మరమ్మతులు, చెట్టు కొమ్మల నరికివేత తదితర చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను ఏర్పాటు చేసిన మండపాల వివరాలు పోలీసుస్టేషన్ల వారీగా అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి.

మండపం ఏర్పాటు సమయంలో, ఆ తర్వాత నిర్వాహకులు పోలీసులు ఇచ్చిన పత్రంలో విగ్రహం ఎత్తు, నిమజ్జనం జరిగే తేదీ, ప్రాంతం ఉంటున్నాయి. ఈ వివరాలు సేకరించిన ట్రాఫిక్‌ ఠాణాల వారీగా అధ్యయనం చేస్తున్నారు. సదరు విగ్రహం ఊరేగింపు జరిగే మార్గాల్లో ఉన్న వంతెనలు, వాటి ఎత్తు పరిగణనలోకి తీసుకుంటున్నారు. రోడ్డు నుంచి వంతెన ఎంత ఎత్తులో ఉందో దాని కంటే కనిష్టంగా ఐదు అడుగుల తక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలకే ఆయా రూట్లలో క్లియరెన్స్‌ ఇస్తున్నారు. ట్రాలీ లేదా లారీ ఎత్తును పరిగణనలోకి తీసుకుంటూ ఇలా చేయనున్నారు. మిగిలిన వాటికి నిర్ణీత సమయం ముందే ప్రత్యామ్నాయ మార్గాలు సూచించనున్నారు.

పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లో హోల్డింగ్‌ ఏరియా...
నిమజ్జనానికి విగ్రహాలను తీసుకువచ్చే ప్రతి వాహనానికీ పోలీసు విభాగం సీరియల్‌ నెంబర్‌తో కూడిన స్టిక్కర్‌ ఇస్తుంటుంది. ఈసారి ఇందులో విగ్ర హం ఎత్తును పొందుపరుస్తున్నారు. ఆయా వాహనాలకు ముందు భాగంలో అతికించి ఉండే దీన్ని అంబేడ్కర్‌ విగ్రహం చౌరస్తాలోని పోలీసు సిబ్బంది పరిశీలిస్తారు. విగ్రహం ఎత్తు ఆధారంగా ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లోని వాటిని పంపిస్తారు. నిమజ్జనం రోజున ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ల్లోకి సాధారణ వాహనాలు అనుమతించరు. ఈ నేపథ్యంలోనే వీలున్నంత వరకు 29వ తేదీ తెల్లవారేసరికి నిమజ్జనం పూర్తి చేసి, ఈ రెండు రూట్లను సాధారణ వాహనాలను అందుబాటులోకి తేవాలని ట్రాఫిక్‌ అధికారులు భావిస్తున్నారు.

అప్పటికీ కొన్ని విగ్రహాల నిమజ్జనం మిగిలి ఉంటే పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ను హోల్డింగ్‌ ఏరియాగా చేసి వాటితో ఉన్న వాహనాలను అక్కడికి పంపిస్తారు. ఆపై ఆ మార్గంతో పాటు ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఉన్న క్రేన్ల వద్ద క్రమపద్దతిలో నిమజ్జనం చేయడుతూ... రెండు మార్గాలను సాధారణ ట్రాఫిక్‌కు అందుబాటులోకి తీసుకురానున్నారు. మరోపక్క పాతబస్తీలోని సున్నిత ప్రాంతాల్లో ఉన్న గణేష్‌ మండపాల వద్దకు స్వయంగా వెళ్తున్న నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ అక్కడి పరిస్థితులు, మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన గురువారం రాత్రి హుస్సేనిఆలం, కామాటిపుర, మొఘల్‌పురాలో ఆనంద్‌ పర్యటించారు.

తెలుగుతల్లి జంక్షన్‌ మూసివేతతో..
రాజధానిలో ఎన్ని నిమజ్జనం జరిగే చెరువులు, పాండ్స్‌ ఉన్నప్పటికీ... హుస్సేన్‌సాగర్‌కు ప్రత్యేకత ఉంది. బషీర్‌బాగ్‌ వైపు నుంచి వచ్చే ప్రధాన ఊరేగింపులోని విగ్రహాలన్నీ అంబేడ్కర్‌ విగ్రహం చౌరస్తా, తెలుగుతల్లి జంక్షన్‌ మీదుగా అటు ట్యాంక్‌బండ్‌, ఇటు ఎన్టీఆర్‌ మార్గ్‌వైపు వస్తాయి. అయితే కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో ఆ ప్రాంతంలోని రహదారులు, జంక్షన్ల వద్ద కీలక మార్పు చేర్పులు జరిగాయి. తెలుగుతల్లి చౌరస్తా మూసివేతతో పాటు సచివాలయం ముందు కొత్త రోడ్డు అందుబాటులోకి రావడం, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ఫుట్‌పాత్‌ నిర్మాణాల నేపథ్యంలో ఈ ఏడాది నిమజ్జనం ప్రక్రియలో స్వల్పమార్పు చేర్పులు చోటు చేసుకోనున్నాయి.

తెలుగుతల్లి జంక్షన్‌ మూసివేత నేపథ్యంలో ఆ ప్రాంతం మీదుగా విగ్రహాలతో వచ్చే లారీలు ఇక్బాల్‌ మినార్‌ వైపు వెళ్లి... ఫ్లైఓవర్‌ ప్రారంభం వద్ద యూ టర్న్‌ తీసుకుని ట్యాంక్‌బండ్‌ వైపు రానున్నాయి. ఫార్ములా ఈ–రేసింగ్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బారికేడ్లను ట్రాఫిక్‌ అధికారులు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లోని పీపుల్స్‌ ప్లాజా పక్కన ఓ నిమజ్జనం ఘాట్‌ నిర్మించిన అధికారులు అక్కడ అదనంగా మూడు క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు. డీసీఎం వాహనాల్లో వచ్చే మధ్య స్థాయి ఎత్తు విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement