మిషన్ గణేష్
- ప్రశాంతంగా ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు
- భారీ బందోబస్తు ఏర్పాట్లు
- 17నవినాయక చవితి
- 27న సాగర్‌లోనే నిమజ్జనం
- డీజేలకు అనుమతి లేదు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో గణనాథుని ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారు. జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు అనుమతి నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అపశ్రుతులు దొర్లకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించారు. దీనికోసం మైత్రీ సంఘాల సహకారం తీసుకోనున్నారు. గతంలో మాదిరిగా అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో ఉత్సవాలు సజావుగా సాగేలా చూడాలని నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 25 వేలు, సైబరాబాద్‌లో 15 వేల విగ్రహాలు ప్రతిష్టించే అవకాశం ఉంది. ప్రధాన ప్రాంతాలతో పాటు గల్లీల్లో వినాయక విగ్రహాలు ప్రతిష్టించే మండపాల నిర్వాహకులు విద్యుత్ , నీటి సరఫరాకు అనుమతి తీసుకునేలా పోలీసులు చొరవ తీసుకుంటున్నారు.
సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి
జంట పోలీసు కమిషనరేట్లలో ఉన్న 1200 సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి స్టేషన్ పరిధిలో స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) నుంచి హోంగార్డు వరకు స్థానికంగా మండపాల నిర్వహణతో పాటు అక్కడి సమస్యలపై దృష్టి సారించేలా చూస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జంట కమిషనర్లు మహేందర్ రెడ్డి, సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
నాయక చవితి ఉత్సవాల్లో గతంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుని... అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పాత నేరగాళ్ల కదలికపై డేగ కన్ను వేయడంతో పాటు ప్రధాన ప్రాంతాల్లో చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. నగరంలోకి వచ్చే సరిహద్దుల వద్ద ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకొచ్చే గోవులు, పశువులను వెటర్నరీ డాక్టర్ల సమక్షంలో పరీక్షించనున్నారు. అంతా ఓకే అనుకున్నాకే అనుమతి ఇవ్వనున్నారు.
సిబ్బంది కావాలని...
వినాయక చవితి ఉత్సవాల కోసం భద్రతా పరంగా మరింత మంది సిబ్బంది కావాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌లు హోంశాఖ మంత్రి నాయిని, డీజీపీ అనురాగ శర్మల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. నగరంలో 12 వేలకు పైగా సిబ్బంది ఉన్నా... మరో పదివేల మంది అవసరమని చెప్పినట్టు సమాచారం. సైబరాబాద్‌కు ఏడు వేల మంది ఉన్నారని... మరో రెండు వేల మంది కావాలని కోరినట్టు సీపీ సీవీ ఆనంద్ కోరినట్టు తెలుస్తోంది.
అప్రమత్తంగా ఉండండి
వినాయక చవితి, బక్రీద్, అసెంబ్లీ సమావేశాలు ఈ నెలలోనే వరుసగా వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సుమారు గంటకుపైగా సిబ్బందితో మాట్లాడారు. ఎక్కడా ఎటువంటి అపశ్రుతులకు తావులేకుండా ఉత్సవాలు నిర్వహించేలా చూడాలన్నారు. ప్రజల సహకారంతో వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు: హోంమంత్రి నాయిని
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి, బక్రీద్ పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకుప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో హోం మంత్రి అధ్యక్షతన గణేషుని ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు సమన్వయంతో చేయాల్సిన పనులను, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నాయిని విలేకరుల సమావేశంలో వివరించారు. 17న వినాయక చవితి, 24న బక్రీద్ పండుగకు, 27న గణేషుని నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
మండపాలకు విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. డీజే సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. అందరికీ క్రేన్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈసారి కూడా హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేయనున్నట్టు వెల్లడించారు. నగరంలోని అన్ని శాఖల సమన్వయంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి టి.పద్మారావు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
సీఎం లేకుండా సమావేశమా?
వినాయక ఉత్సవాలపై ప్రభుత్వం నిర్వహించిన సమావేశం తూతూ మంత్రంగా సాగిందని గణేశ్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు దుయ్యబట్టారు. సచివాలయంలో సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ సెక్యులర్ ఇమేజ్ కాపాడుకోవడం కోసమే సమావేశానికి రాకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. ఈ సమావేశం ఎలాంటి నిర్ణయాధికారాలు లేకుండా ముగిసిందన్నారు. పోలీసులు అనేక ఆంక్షలు విధించినా వాటిపై నోరు మెదపడం లేదన్నారు. సీఎం విదేశీ పర్యటన ముగిసిన తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి, లోటుపాట్లపై చర్చించాలని కోరారు. గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.