పాలనను పరుగులు పెట్టించే దిశగా 16న కీలక సమావేశం
9 అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్షించనున్న సీఎం
ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రా«థమ్యాలను వివరించే ప్రయత్నం
ఇవీ ఎజెండాలోని అంశాలు
ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం– సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య. శాంతిభద్రతలు–రక్షణ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న మంత్రులతో కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌కమిషనర్లు, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారు. పాలనను పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే క్రమంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం.
గత డిసెంబర్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం నిర్వహించినా, ఆ తర్వాత వెంటనే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడం, కలెక్టర్లు, ఎస్పీలంతా పూర్తిగా ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో పాలనపై దృష్టి సారించలేకపోయారు. కోడ్ ముగియడం, ఈ మధ్యనే కలెక్టర్లు, కార్యదర్శులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు చేయడం ద్వారా కొత్తగా ఆయా స్థానాల్లోకి వచ్చిన అధికారులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రా«థమ్యాలపై దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోనున్నారు. 16న నిర్వహించే సమావేశ ఏజెండాలోని అంశాలను కూడా వారికి పంపించారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను ఎజెండాలో చేర్చారు.
⇒ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, అక్కడ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.
గడిచిన ఆరేడు నెలల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఏ విధమైన విజ్ఞాపనలు ఉన్నాయి? వచి్చన విజ్ఞాపనల్లో ఎన్నింటికి పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? పెండింగ్‌లో ఉండడానికి గల కారణలేంటి? అన్న అంశాలను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.
⇒ ఆర్థికంగా పెద్దగా భారం కాని పనులు కూడా పరిష్కరించకుండా ఉన్న పక్షంలో వాటిపై అధికారులకు నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వివరించారు.
⇒ భూముల సమస్యకు సంబంధించి ధరణిని రద్దు చేస్తామని, రైతులకు ప్రయోజనకరంగా ఉండే కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. ధరణిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కలెక్టర్ల నుంచి ఫీడ్ తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
⇒ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు, వర్షాభావ పరిస్థితులున్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
⇒ వర్షాకాలసీజన్‌లో వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, ముందస్తుగా చేపట్టాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయం కలి్పంచేందుకు డాక్టర్లు, సిబ్బంది, మందులు తదితర అంశాలను చర్చించనున్నారు.
⇒ వర్షాకాలంలో దాదాపు 20 కోట్ల మొక్కలను ఈసారి నాటాలని నిర్ణయించారు. కార్యక్రమం కొనసాగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు.
⇒ మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు.
⇒ విద్యాసంవత్సరం ప్రారంభం, పాఠశాలల పరిస్థితి, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను క్షుణ్ణంగా కలెక్టర్లతో సమీక్షిస్తారు.
⇒ ఇక శాంతిభద్రతలు, రక్షణపరమైన అంశాలతోపాటు, రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల మాట వినిపించరాదని సీఎం ఇదివరకు ఇచి్చన ఆదేశాలు మరోసారి ఈ సమావేశంలో పునరుద్ఘాటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment