సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి మొదలైనప్పట్నుంచి జీవితంలో ఎన్నడూ చూడని అమానవీయ సంఘటనల్ని మన కళ్లముందుంచింది. కరోనా వైరస్ మానవ జీవితంపైనే కాదు వ్యక్తుల అంత్యక్రియలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యక్తి చనిపోతే కడచూపునకు నోచుకోవడం, అంత్యక్రియలకు హాజరుకావడం మరణించిన వ్యక్తికి మనమిచ్చే అంతిమ సంస్కారం. కానీ, కరోనా కాలంలో అంతిమ సంస్కారం ఇప్పుడో ఫక్తు వ్యాపారమైపోయింది. కాసులు కదిలిస్తే కానీ ఖననం కానివ్వమంటున్నాయి శ్మశాన వాటికలు. కరోనా వైరస్‌తో మరణించిన వ్యక్తి అంత్యక్రియలే కాదు సహజ మరణం పొందిన వ్యక్తి దహనసంస్కారాల ఖర్చును మరింత భారం చేసింది. ఇదివరకు నగరంలోని కుటుంబంలో ఓ వ్యక్తి సహజ మరణం పొందితే అంత్యక్రియలకు అయ్యే ఖర్చు రూ.15వేల లోపు ఉండేది. ప్యాకేజీ రూపంలో ప్రైవేటు ఏజెన్సీకి అప్పగిస్తే ఈ కార్యక్రమాలన్నీ ఏజెన్సీ నిర్వాహకులే చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ప్యాకేజీ ధరను ఏకంగా రూ.25వేలకు పెంచేశారు.
సర్వీసు పేరిట వసూళ్లు :
ప్రస్తుతం ఎవరైనా మరణిస్తే దగ్గరి బంధువులు మాత్రమే వచ్చి చివరిసారి ముఖాన్ని చూసి వెళ్తున్నారు. చాలావరకు అంతిమసంస్కారాలు పూర్తయ్యే వరకు కూడా ఉండటం లేదు. ఈక్రమంలో ఏజెన్సీ నిర్వాహకు లు మృతదేహాన్ని శ్మశానానికి తరలించడం, తిరిగి శ్మశాన వాటికలో కార్యక్రమాలకు కలిపి సొమ్ము వసూలు చేస్తున్నారు. శ్మశానవాటికలో నిర్వాహకుల కు ప్రత్యేకంగా రూ.5వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇలా అన్ని ఖర్చులు కలుపుకుంటే పట్టణ ప్రాంతాల్లో దహనసంస్కారాలకు రూ.25 వేల నుంచి 30వేలు అవుతున్నాయి. మూసాపేటకు చెందిన ఓ ఇంట్లో వారం వ్యవధిలో ఇద్దరు సభ్యులు మరణించారు. వీరికి వేర్వేరుగా అంతిమ సంస్కారాలు చేస్తే ఖర్చు రూ.80వేల వరకు వచ్చిందని ఆ కుటుంబసభ్యులు తెలిపారు. ఇక, గ్రామీణ ప్రాం తాల్లోనైతే రూ.50 వేలకుపైగా ఖర్చు వస్తోంది. పంచాయతీకి సైతం ఫీజును ఇవ్వాల్సి వస్తోంది.
కోవిడ్ మరణానికి అదనం :
కరోనా వైరస్ ప్రభావంతో మృతి చెందిన వారి అంత్యక్రియలను జీహెచ్‌ఎంసీయే నిర్వహిస్తోంది. దీనికి ఎలాంటి చెల్లింపులు చేయొద్దని స్పష్టం చేసినప్పటికీ శ్మశానవాటికలో నిర్వాహకులు మాత్రం ఆ కుటుంబం నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. చితిపైకి మృతదేహాన్ని చేర్చిన తర్వాత ముఖాన్నిచూపించిన అనంతరం కుటుంబ సభ్యుల నుంచి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఎర్రగడ్డ శ్మశాన వాటికలో నిర్వహకులు పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కంప్లెయింట్ సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment