సాక్షి, హైదరాబాద్: కరువులో అధికమాసం.. ఇది నానుడి. కరోనా కాలంలో అధిక ఆదాయం.. న్యూ‘నుడి’! ఒకవైపు కరోనా కలవరం, మరోవైపు సెలవులు.. అయినా రిజిస్ట్రేషన్ల శాఖకు కాసులపంట పడింది. ఆ శాఖ శ్రావణశోభను సంతరించుకుంది. ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ లావాదేవీలు భారీగా పెరిగాయి. ఈ నెలలో 12 రోజుల ఆదాయం రూ.106 కోట్లు దాటింది. అయితే, సెలవులు పోను ఆరు రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. ఈ లెక్కన రోజువారీ ఆదాయం సగటున దాదాపు రూ.18 కోట్లకు చేరింది. ఆగస్టు ఒరవడిని బట్టి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మళ్లీ పూర్వస్థితికి చేరినట్టేనని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
కొత్త వెంచర్లు మినహా..
రాష్ట్రంలోకి కరోనా ప్రవేశించడానికి ముందు రోజూ 5 వేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. సగటున రూ.20 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్‌డౌన్ కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడడంతో ఆదాయం స్తంభించిపోయింది. మే నెలలో తిరిగి ప్రారంభమైనా జూన్, జూలై మాసాల్లో ఆశించిన మేర లావాదేవీలు జరగలేదు. ప్రజల వద్ద నగదు లభ్యత లేకపోవడం, రుణాల మంజూరుకు ఆటంకాలు ఏర్పడడం, కరోనా వైరస్ భయంతో రిజిస్ట్రేషన్లకు జనం పెద్దగా ముందుకు రాలేదు. కానీ, జూలైలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడం, జూలైలో శ్రావణమాసం రావడంతో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పెరిగాయని ఆ శాఖ అధికారులంటున్నారు.
లాక్‌డౌన్‌కు ఒకట్రెండు నెలలు ముందు కొత్తగా వేసిన వెంచర్లు మినహా అన్ని లావాదేవీల్లో పురోగతి కనిపిస్తోందని, లాక్‌డౌన్‌కు ముందు తరహాలోనే ఆగస్టులో కార్యకలాపాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆదివారాలు, బక్రీద్, కృష్ణాష్టమి, రెండో శనివారం సెలవుదినాలు కాగా, రాఖీ పౌర్ణమి నాడు ఐచ్ఛిక సెలవు కారణంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పనిచేయలేదు. దీంతో ఈ నెలలో కేవలం 6 రోజులు మాత్రమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పూర్తిస్థాయిలో పనిచేశాయి. అయినా ఆదాయం రూ.106 కోట్లు దాటడం, రోజు సగటు లాక్‌డౌన్‌కు ముందు మాదిరిగా దాదాపు రూ.18 కోట్లకు చేరడం గమనార్హం. ఇక, ఈ ఏడాది గణాంకాలు పరిశీలిస్తే ఇప్పటివరకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం రూ. 1,111 కోట్లకు చేరింది. ఆగస్టులో రోజుకు 4 వేలకుపైగా రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి. ఇదే ఊపు కొనసాగితే ఆగస్టు నెలలో ఆదాయం లాక్‌డౌన్‌కు ముందు ఉన్నట్టు రూ.500 కోట్లకు చేరుకునే అవకాశం ఉందనే భరోసా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారుల్లో కనిపిస్తోంది.
6 రోజులు.. రూ.106 కోట్లు!
Published Thu, Aug 13 2020 5:40 AM | Last Updated on Thu, Aug 13 2020 5:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment