సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ విద్యాదోపిడీకి చెక్ పెట్టేలా విద్యాశాఖ బడ్జెట్ ప్రతిపాదనలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులకు తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో భట్టి బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ రూ.15 వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు డిప్యూటీ సీఎం ముందు ఉంచింది. పెరిగిన వేతనాలు, పెండింగ్ డీఏలకే రూ.11 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఉన్నత విద్యాశాఖకు గత ఏడాది రూ. 700 కోట్ల నిధులు కేటాయిస్తే, ఈసారి రూ. 2,500 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు పంపారు.
యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ కొరత, మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండటంతో నిధుల ప్రతిపాదన భారీగానే ఉంది. ఇంటర్ విద్యకు రూ.1,400 కోట్లు ప్రతిపాదించారు.
ఫీజుల నియంత్రణపై ప్రణాళిక
ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్న తీరుకు అడ్డుకట్ట వేయాలని భట్టి అధికారులకు సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై ఆకస్మిక దాడులు చేపట్టాలని ఆదేశించారు.
బాసర తరహాలో రాష్ట్రంలో మరోచోట ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో 10 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, దీనికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని చెప్పారు.
ప్రైవేట్ వర్సిటీతో ఎందుకు పోటీ పడటం లేదు
ప్రైవేట్ వర్సిటీలతో ప్రభుత్వ వర్సిటీలు ఎందుకు పోటీ పడటం లేదని అధికారులను భట్టి అడిగారు. ప్రైవేట్‌లోఉన్న కోర్సులను ప్రభుత్వ వర్సిటీల్లోనూ ప్రవేశపెట్టాలన్నారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో యూనివర్సిటీల ఏర్పాటు కు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment