ఎన్ కన్వెన్షన్ కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేపట్టాం
ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరిస్తుంది
2014కు ముందు హైదరాబాద్‌లో చెరువులెన్ని?
ఇప్పుడు ఉన్న చెరువులెన్ని ?
రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతాం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఢిల్లీ: ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్ కన్వెన్షన్‌కు నోటీసులు ఇచ్చిన తర్వాతనే కూల్చివేతలు చేసినట్లు మల్లు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరించిందని ఆయన స్పష్టం చేశారు.
2014కు ముందు హైదరాబాద్‌లో ఉన్న చెరువులు ఎన్ని ఉన్నాయో.. ఇప్పుడు ఉన్న చెరువు ఎన్నో చూస్తే ఆక్రమణలు బయటపడతాయన్నారు. రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మ్యాపులతో అన్ని లెక్కలు బయటపెడతామన్నారు. కబ్జా అయిన చెరువులను కాపాడవద్దని అంటారా? అని మీడియా సమావేశంలో విలేకర్లను ఎదురు ప్రశ్నించారు డిప్యూటీ సీఎం భట్టి.
‘హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్ అండ్ రాక్స్. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చెరువులు ఏవీ ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించడం కోసం ఏర్పాటు చేసిందే హైడ్రా. దీన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ప్రతి పనికి నోటీసులు ఇచ్చి ఆపై చర్యలు తీసుకుంటున్నారు.
బఫర్ జోన్ లో కాదు, నేరుగా చెరువులోనే కఠిన నిర్మాణాలను కూల్చేస్తున్నారు. సాటిలైట్ ఫోటోల ద్వారా విభజనకు ముందు, విభజన తర్వాత ఈ 10 ఏళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయి తెలుసుకుంటున్నాం.
రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫోటోలను తీసి, అంతకుముందు ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నది ప్రజల ముందు పెడతాం.చట్ట ప్రకారం, చట్టానికి లోబడి మాత్రమే చర్యలు చేపడతున్నాం. అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతాం. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment