సిరిసిల్ల: ‘రాజకీయాల్లోకి వచ్చేదాకా నాకు కులం, మతం గురించి పెద్దగా తెలియదు. నాకు కుల గజ్జి లేదు. నేను అందరివాడిని. అభివృద్ధి నా కులం. సంక్షేమమే నా మతం’అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్ శుక్రవారం రెడ్డి సంఘం భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్డి, వైశ్య కార్పొరేషన్ల ఏర్పాటుకు హామీ ఇచ్చామని, కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఆలస్యమైందన్నారు. వీటి ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నెరవేరుస్తానన్నారు. అన్ని కులాల్లోనూ పేదలున్నారని, వారిని ఆదుకోవడం తమ బాధ్యతని పేర్కొన్నారు. రెడ్డి వర్గంలోని సంపన్నులు పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అన్ని కులసంఘాలకు దశలవారీగా ఆత్మగౌరవ భవనాలకు స్థలం కేటాయిస్తామని, భవన నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు.
65 ఏళ్లలో ఏంచేశారు?
ఒక రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ రైతులు ఒక్క పైసా కట్టనవసరం లేకుండా రూ.5 లక్షల బీమా కల్పించారని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని, రైతుబంధు పథకంలో పెట్టుబడి సాయంగా అన్నదాతల ఖాతాల్లో డ బ్బులు జమ అవుతున్నాయని వివరిం చారు. ఇప్పటివరకు రూ.58వేల కోట్ల సా యాన్ని అందించినట్లు తెలిపారు. పేదలకు ఆసరా, కల్యాణలక్ష్మి పథకాలు అండగా నిలుస్తున్నాయన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. 65 ఏళ్లు రా ష్ట్రాన్ని, దేశాన్ని పాలించిన పార్టీలు ఇన్నేళ్లు ఏం చేశాయని కేటీఆర్ ప్రశ్నించారు.
‘కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, మీ ఆశీర్వా దంతో సీఎం అయిన ఎనిమిదేళ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. కొందరు పిచ్చోళ్లు, అవులగాళ్లు వెటకారంగా మాట్లాడుతున్నారు. బీసీలను బలోపేతం చేస్తూ ప్రభుత్వం కులవృత్తులకు అండగా ఉంటే మేం గొర్రెలు కాయాలా? బర్రెలు కాయాలా? అని అంటున్నారు. చదువుకున్నోళ్లకు కొలువులు రావాలి. శాశ్వత ఉపాధి లభించాలి. చదువు రాని వాళ్లు ఆయా కులవృత్తుల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’అని చెప్పారు. రాష్ట్రంలో రూ.5వేల కోట్లతో గొర్రెలను పంపిణీ చేస్తే గొల్ల, కుర్మల సంపద పెరిగిందని, రెండో విడతలోనూ రూ.4వేల కోట్లతో పంపిణీ చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూగర్భ జలాలు పెరిగిన అంశం ఐఏఎస్ ట్రైనీలకు పాఠ్యాంశమైందని కేటీఆర్ గుర్తుచేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment