భూ పరిపాలనా రంగంలో అతిపెద్ద సంస్కరణ  | Dharani has been game changer: CS Somesh Kumar | Sakshi
Sakshi News home page

భూ పరిపాలనా రంగంలో అతిపెద్ద సంస్కరణ 

Published Sat, Oct 30 2021 1:23 AM | Last Updated on Sat, Oct 30 2021 1:38 AM

Dharani has been game changer: CS Somesh Kumar - Sakshi

‘ధరణి’ విజయాలపై పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూపరిపాలనా రంగంలో వచ్చిన అతి పెద్ద సంస్కరణ ధరణి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్‌ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో పలు శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతోనే ధరణి సాధ్యమైందని, ఈ సాహసాన్ని కేసీఆర్‌ తప్ప ఎవరూ చేయలేరని కొనియాడారు.

సంవత్సర కాలంలో ఊహించినదాని కన్నా విజయవంతమైందని, 5.14 కోట్ల మంది ధరణి పోర్టల్‌ను చూడటం, 10 లక్షలకు పైగా లావాదేవీలు జరగడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అమలవుతున్న విప్లవాత్మక పథకాల కారణంగా రాష్ట్రంలోని భూముల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ధరణి పోర్టల్‌ కారణంగా భూ రికార్డులు పటిష్టంగా మారాయని, రికార్డులను తారుమారు చేసే పరిస్థితి లేకుండా భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు.

గతంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు 574 తహసీల్దార్‌ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు చెప్పారు. ధరణి విజయవంతం కావడంలో సీనియర్‌ అధికారులు, ఐటీ నిపుణుల శ్రమ ఉందని, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈ విజయంలో కీలక భూమిక పోషించారని ప్రశంసించారు. ఏడాది కాలంలో ధరణి సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆవిష్కరించారు.

సమావేశంలో పలు శాఖల కార్యదర్శులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, ఎస్‌.ఎం.రిజ్వీ, రాహుల్‌ బొజ్జా, శేషాద్రి, రఘునందన్‌రావు, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ శరత్, సీసీఎల్‌ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement