షాద్‌నగర్: ఆ దారుణం.. మనసున్న ప్రతి హృదయాన్ని కదిలించింది. ఆ దహనం ప్రతి గుండెనూ దహించింది. ఓ అమ్మాయిపై జరిగిన దారుణ మారణకాండ దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసింది. నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశను హతమార్చిన నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన జరిగి నేటికి రెండేళ్లు పూర్తయింది.
ఎన్నో మలుపులు
దిశ హత్యోదంతం తర్వాత ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. దిశను హత్య చేసిన నిందితులను పోలీసులు 2019 నవంబర్ 29న షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో ఇక్కడే వారిని ఎన్‌కౌంటర్ చేయాలని ప్రజలు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం.. పోలీసుల పైకి రాళ్లురువ్వడం.. చెప్పులు విసరడం.. లాఠీచార్జీ చేయడం తెలిసిందే.
ఆ తర్వాత నిందితులను పోలీసులు చటాన్‌పల్లి జైలుకు తరలించారు. 2019 డిసెంబర్ 6న తెల్లవారు జామున దిశను హతమార్చిన నలుగురిని సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపైకి తిరగబడటంతో పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
ప్రజా సంఘాల ఆందోళన
ఎన్‌కౌంటర్ ఘటనపై విచారణ కోసం సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్ సభ్యులు ఆదివారం చటాన్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని, దిశను కాల్చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిషన్ ప్రజలకు ఏవిధమైన సంకేతాలు ఇస్తోందని.. నిందితుల తరఫున విచారణ చేపట్టడం ఏమిటని నిలదీశారు. దీంతో దిశ హత్యోదంతం, ఎన్‌కౌంటర్‌ఘటన మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment