సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. టప్పాచబుత్రలో కుక్క దాడి చేయడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన తల్లితో కలిసి బాలుడు విధిలో నడుస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయిదేళ్ల బాలుడిని కుక్క కరిచిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
అయితే బాలుడి తల్లి వెంటనే గుర్తించి అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసినట్లు తెలుస్తోంది. చిన్నారికి జర్జరీ చేశారని, అందుకోసం తల్లిదండ్రులు రూ. 3 లక్షలు వెచ్చించినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట కుక్కలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపించడంతో తెలంగాణ హైకోర్టు ఈకేసును సుమోటోగా తీసుకొని జీహెచ్‌ఎంసీకి, ప్రభుత్వ అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కుక్కలు వీధుల్లో తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావటం లేదు.
ప్రస్తుతం వీధి క్కలపై జీహెచ్‌ఎంసీ ఫోకస్ తగ్గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ డ్యూటీతో పాటు వెటర్నరీ అధికారులు బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు సిబ్బంది నిరసన చేస్తుండటంతో కుక్కల కాటు కేసులు నగరంలో మళ్ళీ పెరుగుతున్నాయి. కుక్కల బెడదపై వేసిన హై లెవెల్ కమిటీ ఎక్కడ ఉందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కమిటీ ఏర్పాటు చేసి.. ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం శోచనీయం
Comments
Please login to add a commentAdd a comment